హఠాత్తుగా జోరు వాన, వడగళ్లతో బీభత్స వాతావరణం
బీజింగ్ :వాయువ్య చైనాలో మారథాన్‌లో ప్రకృతి వైపరీత్యంతో 21ఘోర విషాదం చోటు చేసుకుంది. మారధాన్‌లో పాల్గొన్న మొత్తం 172 మందిలో 21 మంది హఠాత్తుగా జోరువాన, వడగళ్లు కురియడమే కాక, బలమైన గాలులు వీచడంతో తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది. చైనా లోని గన్సు ప్రావిన్సుకు వాయువ్యంగా బైయిన్ నగరానికి సమీపాన యెల్లో రివర్ స్టోన్ అటవీ ప్రాంతంలో కొండలపై 100 కిలో మీటర్ల పర్వత మారధాన్ శనివారం నిర్వహించారు. ఇందులో దాదాపు 172 మంది పాల్గొన్నారు.
మారధాన్ పరుగు సాగుతుండగా 20 నుంచి 31 కిమీ మధ్యలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా వడగళ్లు, మంచు వాన, భరించలేని చలి గాలులు సంభవించడంతో 21 మంది చలిని తట్టుకోలేక గడ్డకట్టుకు పోయి ప్రాణాలు కోల్పోయారని బైయిన్ నగర మేయర్ జాంగ్ జిచెన్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మారథాన్‌ను నిలిపి వేసి స్థానికుల సహాయంతో1200 రెస్కూ బృందాలు రంగం లోకి ఆదివారం ఉదయానికి 151 మందిని రక్షించ గలిగాయి. గాయపడిన 8 మంది రన్నర్లను ఆస్పత్రికి తరలించారు. మారధాన్‌లో పాల్గొన్న పలువురు రన్నర్లు హైపోథెర్మియా (అల్ప ఉష్ణస్థితి)తో బాధపడుతున్నట్టు అధికారులు తెలిపారు. మారథాన్‌లో పాల్గొన్న వారు షార్ట్, టీషర్ట్ ధరించడం కూడా మృతికి దారి తీసిందని అధికారులు చెబుతున్నారు.