న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు. కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయవ్యవస్థను బహిరంగంగా అవమానిస్తున్నారని, అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కొందరు వారి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం విపరీత చర్యలకు పాల్పడుతున్నారని , దాని వల్ల ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వారు తమ లేఖలో అధికార బీజేపీ ప్రతిపక్షపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ప్రతిపక్షాలపై అవినీతి కేసులు, బాధిత నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించినా వారికి ఎటువంటి ఉపశమనం దక్కకపోవడం మొదలైన విషయాల గురించి పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో కృత్రిమ పద్ధతులు చోటుచేసుకునేలా కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థ పవిత్రతను అగౌరవ పరుస్తాయని తెలిపారు. అనవసర ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం మనపైనే ఉందని రిటైర్డ్ న్యాయమూర్తులు ఆ లేఖలో పేర్కొన్నారు. కొన్ని రాజకీయ సమూహాలు న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా నిరాధారమైన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, వారు అనుకూల ఫలితాలు పొందేలా వ్యూహాలు రచిస్తున్నారన్నారు.
ప్రస్తుతం అరెస్టవుతున్న రాజకీయ నాయకుల విషయంలో ఇది స్పష్టంగా తెలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరి అభిప్రాయాలకు అనుగుణంగా న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడం, అలా చేయని వారిని తీవ్రంగా విమర్శించడం, న్యాయసమీక్ష చేయడం చట్ట నియమాల సారాంశాన్ని దెబ్బ తీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు నేతృత్వం లోని న్యాయవ్యవస్థ ఇటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయవ్యవస్థ పవిత్రత, స్వయం ప్రతిపత్తిని కాపాడాలని వారు కోరారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా , అస్థిరమైన రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉంటుందని రిటైర్డ్ న్యాయమూర్తులు వివరించారు.