గోద్రా: గుజరాత్‌లో 2002లో సంభవించిన గ్రోద్రా మత ఘర్షణల సందర్భంగా మైనారిటీ వర్గానికి చెందిన 17 మంది హత్య కేసులో 22 మంది నిందితులను నిర్దోషులుగా పంచ్‌మహల్ జిల్లాలోని హలోల్ పట్టణంలోని కోర్టు ప్రకటించింది. 2002 ఫిబ్రవరి 28న ఇద్దరు పిల్లలతోసహా మైనారిటీ వర్గానికి చెందిన 17 మందిని హత్య చేసి సాక్ష్యాలు దొరకకుండా వారి శవాలను కొందరు వ్యక్తులు తగలబెట్టారు.
సుదీర్ఘకాలం సాగిన విచారణ సందర్భంగా 8 మంది నిందితులు మరణించగా మిగిలిన 22 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ అదనపు సెషన్స్ న్యాయమూర్తి హర్ష్ త్రివేది మంగళవారం తీర్పు వెలువరించారు. సాక్ష్యాలు లేని కారణంగా నిందితులను కోర్టు నిర్దోషులుగా పరిగణించినట్లు డిఫెన్స్ న్యాయవాది గోపాల్‌సిన్హ్ సోలంకి విలేకరులకు తెలిపారు. 2002 ఫిబ్రవరి 27న పంచ్‌మహల్ జిల్లాలోని గోద్రా పట్టణ సమీపంలో కొందరు ముష్కరులు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడంతో 59 మంది ప్రయాణికులు మరణించారు. మృతులలో అత్యధికులు అయోధ్య నుంచి తిరిగివస్తున్న కరసేవకులు. ఈ సంఘటనతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మతఘర్షణలు చెలరేగాయి.