Friday, November 15, 2024

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం
మిజోరాంలో దుర్ఘటన
మృతుల్లో అత్యధికులు బెంగాల్‌కు చెందిన వారే
ప్రధాని మోడీ, సిఎం థంగా తీవ్ర సంతాపం
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రైల్వే
ఐజ్వాల్: మిజోరాంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో 22 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు21 కిలోమీటర్ల దూరంలో సాయిరంగ్‌ప్రాంతంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో సంఘటన స్థలంలో 35నుంచి 40 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో కొంత మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది. రైల్వే, పోలీసు అధికారుల సమాచారం మేరకు ఇప్పటివరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. కూలిపోయిన ఉక్కు నిర్మాణం కింద ఉన్న నాలుగు మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

భైరవిసాయిరంగ్ కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టులో కురుంగ్‌నదిపై ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ ఘటనపై మిజోరాం ముఖ్యమంత్రి జోరామ్ థంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.‘ఐజ్వాల్ సమీపంలోని సాయిరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైలు వంతెన కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసున్నా’ అని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమాల్లో ఘటన దృశ్యాలను షేర్ చేశారు. మృతుల్లో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా పుకురియా, ఇంగ్లీషు బజార్, మానిక్‌చాక్ ప్రాంతాలకు చెందిన వారని మిజోరాం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సహాయక చర్యల్లో సాయం కోసం మిజోరాం అధికారులతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.

మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా: రైల్వేమంత్రి
మిజోరాంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది.ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు తలా రూ.10 లక్షలు, తీవ్ర గాయాలయిన వారికి రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణ్ణవ్ ప్రకటించారు. మిజోరాం ఘటన దురదృష్టకరమన్న ఆయన.. కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలతోపాటుగా అధికార యంత్రాంగం, రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో స్వల్పగాయాలయిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ట్వీట్ చేశారు. కాగా ప్రమాదంపై దర్యాప్తుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్రధాని సంతాపం
మిజోరాం రైల్వే వంతెన దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలియజేసింది.ప్రస్తుతం ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News