మావోయిస్టుల ‘యు’వ్యూహం.. 22మంది జవాన్లు మృతి
అగ్రనేత హిడ్మా, సుజాతలపై పుకార్లు నమ్మి రంగంలోకి దిగిన భద్రతా బలగాలు
విరుచుకుపడ్డ 400మంది నక్సల్స్
మృతదేహాలపైనా నిర్దాక్షిణ్యం, ఓ జవాను చేయి నరికివేత
సమయానికి చికిత్స అందక డీహైడ్రేషన్‌తో కొందరి మృతి
ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అపహరణ
మూడుగంటలకుపైగా సాగిన యుద్ధకాండ
న్యూఢిల్లీ/రాయ్‌పూర్: కీకారణ్యం.. ఎత్తయిన కొండలు.. పైనుంచి నిప్పులుగక్కుతున్న సూర్యుడు. 40డిగ్రీల వేడిలో దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లింది. గంటలకొద్దీ వందలాది తుపాకులు గర్జించాయి. అందులో కొన్ని బుల్లెట్లు శరీరాలను తూట్లు పొడుచుకుంటూ పోతుంటే.. మరికొన్ని చెట్ల మొదళ్లను చీల్చుకుంటూ వెళ్లాయి. శనివారంనాడు చత్తీస్‌గఢ్‌లోని సుక్మాబీజాపూర్ సరిహద్దులో మూడు గంటలకుపైగా భారీ వృక్షాల మాటున సాగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఇటు జవాన్లు, అటు మావోయిస్టుల రుధిరంతో దండకారణ్యం తడిసిమద్దయింది. ఎటు చూసినా నిశ్శబ్ద భయానక వాతావరణం. మావోయిస్టులు రచించిన పక్కా ప్రణాళికతో ఎక్కువ నష్టం భద్రతా బలగాలకే వాటిల్లింది. నక్సల్స్ ఒక ఏరియాలో సంచరిస్తున్నారని, అక్కడ భద్రతా బలగాలను ఎదుర్కొనే వ్యూహాన్ని రచిస్తున్నారని పక్కా సమాచారం పోలీసు, భద్రతా బలగాలకు అందింది. దీంతో సిఆర్‌పిఎఫ్, కోబ్రా, చత్తీస్‌గఢ్ పోలీసు అనుబంధ డిఆర్‌జి బలగాలు 1500మందితో రంగంలోకి దిగాయి. బృందాలుగా విడిపోయి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. బృందాలుగా విడిపోయి కూంబింగ్ చేస్తున్న ఈ బలగాలను 400 మందికిపైగా మావోయిస్టులు లక్షంగా ఎంచుకున్నారు. అందుకు పక్కా వూహ్యాన్ని రచించుకున్నారు. అదే ‘యు’ వ్యూహం. భద్రతా బలగాలను ‘యు’ ఆకారంలో చుట్టుముట్టి ఒక్కసారిగా 400 మంది అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఆపరేషన్ వెనక పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పిఎల్‌జిఎ) బెటాలియన్‌కు చెందిన మోస్ట్ వాంటెండ్ నేతలు హిడ్మ, ఆయన అనుచరిణి సుజాత ఉన్నట్లు సమాచారం.
ఒకే చోట ఏడు మృతదేహాలు, మావోయిస్టులకూ నష్టం
మావోయిస్టులు తేలికపాటి మిషన్ గన్స్(ఎల్‌ఎంజి), అత్యాధునిక పేలుడు పరికరాలు(ఐఇడి) వాడినట్లు సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఓ అధికారి వివరిచారు. గ్రెనేడ్లు, లాంఛర్లు, దేశీయ రాకెట్లను కూడా మావోయిస్టులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ భీకర యుద్ధంలో 22మంది భద్రతా బలగాలు మరణించగా, 31 మంది గాయాలపాలయ్యారని అన్నారు. సజీవంగా పట్టుబడ్డ కొందరు జవాన్లను చిత్రహింసలు పెట్టి చంపారని అన్నారు. మృత్యువాతపడ్డ మావోయిస్టుల ఆయుధాలు, బూట్లు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను కూడా ఎత్తుకెళ్లారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మావోయిస్టులకు కూడా నష్టం వాటిల్లిందని, కనీసం 10 నుంచి 12 మంది మావోయిస్టులు మృత్యువాతపడ్డారని, వారి మృతదేహాలను ట్రాక్టర్లలో తరలించినట్లు స్పష్టమవుతోందని ఆ అధికారి వివరించారు. ఇప్పటికీ ఓ సిఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ మిస్సింగ్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. చెట్లకు తగిలిన బుల్లెట్‌లను చూస్తుంటే భీకర కాల్పులు జరిగినట్లు స్పష్టమవుతుందన్నారు. ఒకే చోట భద్రతా బలగాలకు చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. ముఖ్యంగా ఇరువర్గాలు పెద్దపెద్ద చెట్ల మొదళ్లను రక్షణగా చేసుకుని కాల్పులు కొనసాగియించాయ న్నారు.
అగ్రనేత ఉన్నట్లు పుకారు.. వలలో బలగాలు..
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఇక్కడి అడవుల్లోనే దాక్కున్నాడని మావోయిస్టులు ఓ పుకారును సృష్టించారు. ఈ ప్రచారం నేపథ్యంలో భద్రతా బలగాలు మావోయిస్టులు సృష్టించిన ట్రాప్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్న చోటే మావోయిస్టులు కాచుకు కూర్చున్నారని, అవకాశం చిక్కడంతో విజృంభించారని భావిస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత గాయపడ్డ ఓ జవాను చేతిని మావోయిస్టులు నరికేసినట్లు కూడా తెలుస్తోంది. మృతుల్లో కొందరు గాయాలతో రక్తం కారుతుండగా.. ఇటు నీళ్లు అందక ‘డీహైడ్రేషన్’ తో కూడా మరణించినట్లు తెలుస్తోంది. అడవుల్లో గాలింపు చర్యలు అధికమైన నేపథ్యంలో ఆహారపు పొట్లాలను, వాటర్ బాటిల్స్‌ను అధికంగా మోయలేదని, సరైన సమయంలో వారికి నీరు, ఆహారం అందుబాటులో లేకపోవడంతో కూడా మరణించి ఉంటారని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.
హెలికాప్టర్ దిగడానికీ…
శనివారం ఎన్‌కౌంటర్ జరిగే సమయానికి సమాచారం అందుకున్న బస్తర్‌లోని జగదల్‌పూర్ సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ వెంటనే హెలికాప్టర్లతో రంగంలోకి దిగేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే కాల్పులు జరుగుతుండడంతో సాధ్యపడలేదు. దట్టమైన అడవి కావడంతో క్షతగాత్రులను వెంటనే తరలించేందుకు హెలికాప్టర్లు దిగడానికి సాధ్యపడలేదు. మొత్తానికి సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎన్‌కౌంటర్ స్థలానికి దగ్గరల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. క్షతగాత్రులైన జవాన్లను దగ్గరల్లోని వివిధ జిల్లాల ఆస్పత్రులకు తరలించారు.
22 Jawans killed in Chhattisgarh Encounter