చార్‌ధామ్ యాత్రికుల విషాదాంతం
ఉత్తరకాశీ : చార్‌ధామ్ యాత్రికులతో వెళ్లుతున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో కనీసం 22 మంది దుర్మరణం చెందారు. ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం ఈ విషాదకర ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన యాత్రికులతో వెళ్లుతున్న ఈ బస్సు ఉత్తరకాశీ జిల్లాలోని దాంతా వద్ద లోయలో పడింది. బస్సు యమునోత్రికి వెళ్లుతూ జాతీయ రాదారిపై ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలియగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని , స్థానిక అధికార యంత్రాంగం వెంటనే ఘటనా స్థలికి చేరుకోవల్సి ఉందని తెలిపారు. వెంటనే అక్కడికి జాతీయ విపత్తు నిర్వహణ దళాలు చేరుకుంటున్నాయని కూడా అమిత్ షా ఓ ప్రకటనలో తెలిపారు. విషయం గురించి తెలియగానే ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు తమ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు తలా రెండు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి రూ 50వేలు తక్షణ సాయం అందిస్తారని తెలిపారు.