Wednesday, January 22, 2025

షిండే వర్గంలో త్వరలో తిరుగుబాటు: సామ్నా

- Advertisement -
- Advertisement -

ముంబై: బిజెపి చూపిస్తున్న సవతి తల్లి వైఖరితో ఇబ్బందిపడుతున్న శివసేనకు(షిండే వర్గం) చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) మంగళవారం వెల్లడించింది. తమ పార్టీ పట్ల బిజెపి సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తోందంటూ శివసేన ఎంపి(షిండే వర్గం) గజానన్ కీర్తికర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) సొంత పత్రిక సామ్నా తన సంపాదకీయంలో మంగళవారం ప్రస్తావించింది.

షిండే గ్రూపు ఎమ్మెల్యేలు, ఎంపీలను బిజెపి బందీలుగా ఉన్న కోళ్లు, కోడి పుంజులుగా అభివర్ణిస్తూ వాటిని బిజెపి ఎప్పుడు వధిస్తుందో చెప్పలేమని సామ్నా పేర్కొంది. బిజెపి వైఖరి భరించశక్యం కానిదిగా, తమ ఆత్మ గౌరవానికి భంగకరంగా మారడంతోనే 2019లో ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన బిజెపితో తెగతెంపులు చేసుకుందని సామ్నా తెలిపింది. ఈ కారణంగానే 2019లో ఎన్‌డిఎకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్, ఎన్‌సపిపితో చేతులు కలిపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని శివసేన ఏర్పాటు చేసినట్లు సామ్నా పేర్కొంది.

థాకరేలకు వెన్నుపోటు పొడిచి బిజెపితో చేతులు కలిపిన శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రేమ వ్యవహారం ఏడాది గడవక ముందే తమ బెడిసిందని, విడాకుల గురించి ఊహాగానాలు బయటకు వస్తున్నాయని సామ్నా తెలిపింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు డ్రైవర్‌గా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మారిపోయారని, ప్రభుత్వంలోని అన్ని అధికారాలు ఆయన చేతిలోనే ఉన్నాయని సామ్నా విమర్శించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News