Sunday, January 19, 2025

ఒకే వేదికపై ఒక్కటైన 220 జంటలు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి ః నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పి మైదానంలో ఆదివారం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సారధ్యంలోని ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 220 జంటలకు సామూహిక వివాహాలు అత్యంత వైభవంగా జరిపించారు. భారీ సినిమా సెట్టింగులను తలపించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా అన్నంత అట్టహాసంగా ఈ సామూహిక వివాహాల మహోత్సవం జరిగింది. సాంప్రదాయ బద్దంగా, శాస్త్రోక్తంగా యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేద పండితులు నిర్ణయించిన ముహుర్తానికి ఉదయం ఈ సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి.

ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్టును స్థాపించిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5 పర్యాయాలు సామూహిక వివాహాలు జరిపించి 720 మందికి ఉచితంగా వివాహాలు జరిపించారు. బంగారు పుస్తెలతో పాటు పట్టు వస్త్రాలు, మంచం, బీరువా, వంట సామాగ్రి, నిజ జీవితంలో అవసరమయ్యే వస్తువులను ఒక్కొక్క జంటకు 2 లక్షల రూపాయలు వెచ్చించి ఈ సామాగ్రిని సమకూర్చారు. 220 మంది జంటలకు ఒక్కొక్కరికి ఒక ముత్యాల పందిరి, ఒక వేద పండితుడు, వధువరుల కుటుంబ సభ్యులు ఉండే విధంగా అందంగా పందిళ్లను తీర్చిదిద్దారు. వివాహ మహోత్సవాలను తిలకించడానికి వచ్చిన సుమారు 30 వేల మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

వివాహానికి వచ్చిన అందరికి భోజన వసతి ఏర్పాటు చేశారు. మర్రి సేవా తత్పరతను ముఖ్య అతిథులు, పలువురు వక్తలు కొనియాడారు. నియోజకవర్గానికి మర్రి లాంటి ఎమ్మెల్యే దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా వారు అభివర్ణించారు. ఈ సామూహిక వివాహ మహోత్సవంలో ఎంపిలు కె. కేశవరావు, నామ నాగేశ్వర రావు, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జెడ్పి చైర్‌పర్సన్ శాంతా కుమారి, కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పి కె.మనోహర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ సాయి చంద్, డిసిసిబి డైరెక్టర్, ట్రస్టు డైరెక్టర్ జక్కా రఘనందన్ రెడ్డి, బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, ట్రస్టు డైరెక్టర్, ఎమ్మెల్యే మర్రి సతీమణి మర్రి జమున, డైరెక్టర్ వెంకట్ రెడ్డి, సతీమణి మధుమతి, ఇతర ప్రముఖులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆయా మతాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News