Saturday, November 23, 2024

నేల తల్లికి వృక్ష కవచం

- Advertisement -
- Advertisement -

220 Crores trees planted in Telangana

హరితహారాన్ని మించిన ఉదాత్త కార్యక్రమం మరోటి లేదు
భవిష్యత్ కోసం పుడమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
మొక్కలను నాటడంలో ప్రపంచంలోనే రాష్ట్రంలో అతిపెద్ద మూడవ మానవప్రయత్నం కొనసాగుతోంది.
ఇందుకోసం 220 మొక్కలను నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5900 కోట్లను వెచ్చిస్తోంది
పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన వెంట ఉండేది చెట్టు మాత్రమే
హరితహారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : హరితహారాన్ని మించిన ఉదాత్త, గొప్ప కార్యక్రమం మరోటి లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. భవిష్యత్ కోసం పుడమి తల్లిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల వారికి మంచి వాతావరణాన్ని అందించాలన్న ప్రధాన లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. పచ్చదనాన్ని 33 శాతానికి చేరుకోవాలన్న సిఎం కెసిఆర్ కల నెరవేరి దేశానికే పాఠాలు చెప్పే ఆదర్శరాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఈ సందర్భంగా కెటిఆర్ ఆకాంక్షించారు. ఇప్పటి వరకు హరిత హారం కింద రూ.5,900 కోట్ల నిధులు ఖర్చుచేశామని, గత ఏడు విడతల్లో 220 కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటామని, ఈ ఏడాది మరో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హరిత హారం కార్యక్రమం కింద విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా నాలుగు శాతం మేరకు అడవుల విస్తీర్ణం పెరిగాయన్నారు. హరితహారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా రాష్ట్రంలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
హరితహారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి పెద్దఅంబర్‌పేట్ కలాన్‌లో హెచ్‌ఎండిఎ రూపొందించిన అర్భన్ ఫారెస్టు పార్కును మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కలు నాటే కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌మోడల్‌గా మారుతోందన్నారు. ప్రతి సంవత్సరం నిర్దేశించుకున్న లక్షం మేరకు మొక్కలు నాటుతూ తెలంగాణ సంపూర్ణ హరిత రాష్ట్రం దిశగా పరుగులు తీస్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞంలా భావిస్తోందన్నారు. సిఎం కెసిఆర్ ప్రకృతి ప్రేమికుడు కావడం వల్లే హరితహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాన్నారు. రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల స్పూర్తితోనే కేంద్రం నగరవన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పార్కులను ఏర్పాటు చేయడంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన అటవీశాఖకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
కరోనా రెండో దశలో దేశం అంతా తల్లడిల్లిపోయిందని, ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు పోవడం అందరినీ కలచివేసిందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే మొక్కలను నాటేందుకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యను ఇస్తోందన్నరు. ఇందులో భాగంగా పట్టణప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అలాగే హెచ్‌ఎండిఎ పరిధిలో రూ. 650 కోట్లతో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 16 పార్కులను ఇదే స్థాయిలో ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. మానవాళికి అత్యవసరమైన ప్రాణవాయువును అందించడంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు కీలకంగా మారతాయన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన వెంట ఉండేది చెట్టు మాత్రమేనని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అందువల్ల పచ్చదనం పెరిగేలా చట్టాలలో రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పెట్టిందన్నారు. 85 శాతం మొక్కలు బతకపోతే స్థానిక ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించే నిబంధనలు పెట్టామన్నారు. ఇది మన పిల్లలు, భవిష్యత్ తరాల కోసం అన్న సోయి అందరికీ రావాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇవ్వాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారన్నారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాటాడుతూ, హరితహారంతో భారతదేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు 15 వేలకు పైగా నర్సరీలు రాష్ట్రంలో తప్ప దేశంలో మరెక్కడా లేవన్నారు.. భావి తరాల వారి కోసం ఆస్తులు, అంతస్తులు కాదు… చెట్లు నాటి సంరక్షించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంతాల పరిధిలో నిర్మిస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎంఎల్‌సిలు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, సురభి వాణిదేవి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, అటవీ శాఖ ప్రిన్సిపల్ సిసిఎఫ్ ఆర్.శోభ, పిసిసిఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, కలెక్టర్ అమయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కూడా పెద్దఎత్తున మొక్కలు నాటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News