అక్టోబర్ 4నుంచి 7వ తేదీ వరకు జూనియర్ లైన్‌మెన్‌లకు 220 కెవి టవర్లు ఎక్కే పరీక్ష
చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలోని 10 బృందాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్: ట్రాన్స్‌కోలో జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీలో భాగంగా అక్టోబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 220 కెవి టవర్లు ఎక్కే పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో పాటు ధ్రువపత్రాలను కూడా పరిశీలించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2017 డిసెంబర్‌లో 1100 జేఎల్‌ఎంల ఎంపిక కోసం తెలంగాణ ట్రాన్స్‌కో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి రాత పరీక్ష కూడా పూర్తయ్యింది. అయితే, దీనిపై పలువురు కోర్టులో కేసు వేయడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా న్యాయస్థానం ఆదేశాలతో జేఎల్‌ఎం ల నియామకానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈనెల 18న జేఎల్‌ఎం పరీక్ష ఫలితాలను ట్రాన్స్‌కో ప్రకటించింది. ఇప్పుడు 220 కెవి టవర్లు ఎక్కే పరీక్షను నిర్వహిస్తున్నారు. అదే రోజున అభ్యర్థుల ధ్రువపత్రాలను సైతం పరిశీలిస్తారు. అయితే, ఈ పరీక్ష కోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలోని 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. మహిళా అభ్యర్థులు సైతం స్తంభాలు ఎక్కాల్సి ఉంటుంది. కాగా, శారీరక వైకల్యం కలిగిన అభ్యర్థులకు స్తంభాలు ఎక్కే పరీక్ష నుంచి మినహాయింపునిచ్చారు.