ముంబయి: ముంబయిలోని రెండు ప్రదేశాలపై దాడులు జరిపిన పోలీసులు, ఎఫ్‌డిఎ అధికారులు ఎగుమతిదారులు అక్రమంగా నిల్వచేసిన 2,200 రెమ్‌డెసివిర్‌కు చెందిన వయల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విషమ స్థితిలో ఉన్న కరోనా రోగులకు రెమ్‌డెసివిర్‌ను ఉపయోగిస్తారు. కొవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతో ఈ మందుకు హఠాత్తుగా డిమాండ్ ఏర్పడింది. పరిస్థితి మెరుగుపడేవరకు రెమ్‌డెసివిర్ ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం గత వారం నిషేధించింది.
రెమ్‌డెసివిర్ అక్రమ నిల్వలపై సమాచారం అందడంతో పోలీసులు, ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డిఎ) అధికారులు నగర శివార్లలోని అంధేరి, దక్షిణ ముంబయిలోని న్యూ మెరైన్ లైన్స్‌లోని రెండు ప్రదేశాలపై సోమవారం దాడులు నిర్వహించారని అధికారులు తెలిపారు. అంధేరి(తూర్పు)కి చెందిన మరోల్ ప్రాంతంలో ఒక ఎగుమతిదారుడికి చెందిన స్థావరంపై దాడి చేసి ఒక ఫార్మా కంపెనీకి చెందిన 2000రెమ్‌డెసివిర్ వయల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ముంబయి పోలీసు ప్రతినిధి ఎస్ చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. న్యూ మెరైన్ ప్రాంతంలోని మరో ఎగుమతిదారుడికి చెందిన ప్రదేశంపై జరిపిన దాడిలో 200 రెమ్‌డెసివిర్ వయల్స్ లభించినట్లు ఆయన చెప్పారు. విదేశీ మార్కెట్ల కోసం తయారు చేసిన ఈ వయల్స్‌ను ప్రభుత్వం నిషేధించడంతో నిల్వ చేసి ఉంచారని ఆయన తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకున్న ఎఫ్‌డిఎ ఈ మందులను ఆసుపత్రులకు అందచేస్తుందని ఆయన వివరించారు.