మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,05,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 22,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 92 మంది ప్రాణాలు కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,87,603 కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 8,707 కి పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 8,832 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలరో 1,90,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని 637 కొవిడ్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న 6,870 ఐసీయూ బెడ్లలో 6,323 నిండిపోయాయని సింఘాల్ వివరించారు. రాష్ట్రంలో 23,259 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉండగా.. 22,265 నిండి పోయాయని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉండటం వల్ల 45 ఏళ్లు మించిన వారికే వాక్సిన్ వేసేందుకు కేంద్రాన్ని అనుమతి కోరామని తెలిపారు. తమ వినతికి కేంద్ర సానుకూలంగా స్పందించిందని సింఘాల్ పేర్కొన్నారు. కావున దీనికి అనుగుణంగా మరో రెండు రోజుల్లో కొవిన్ వెబ్ పోర్టల్‌లో మార్పులు చేస్తామని వెల్లడించారు. ఎవరికి ఎప్పుడు వాక్సిన్ వేస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా చెప్పామని, రెండో డోసు వాక్సినేషన్‌కు మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు. మొదటి డోసు టీకా ఎప్పటి నుంచి ఇస్తామన్న విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని సూచించారు.
22164 New Corona Cases Registered in AP