హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 2261 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 18 మంది మృతి చెందారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. కరోనా నుంచి గురువారం ఒక్క రోజే 3043 మంది కోలుకున్నారని పేర్కొన్నారు. కరోనా పాజిటివిటి రెండు శాతం తగ్గిందని, రికవరీ రేటు కూడా 99.5 శాతంగా ఉందని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. 87 లక్షలకు పైగా ఇండ్లలో ఫీవర్ సర్వే పూర్తి చేశామని, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయిందని, గ్రామాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గించేందుకు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
కరోనా కేసుల సంఖ్య 5.83 లక్షలకు చేరుకోగా 3313 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 5.46 లక్షల మంది కోలుకోగా 33 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. 1.5 కోట్ల మందికి కరోనా టెస్టులు చేయగా 62.1 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.