2275టి.ఎం.సి.లు వృధా
సీజన్ మొదటి నెలలోనే గోదావరికి భారీవరద
ప్రమాదకరంగా ప్రవహించిన ఉపనదులు
పరివాహక ప్రాంతం, ఆయకట్టు మొత్తం జలమయమే
మన తెలంగాణ/హైదరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమైన మొదటి నెలన్నర రోజుల్లోనే గోదావరి నది ఉగ్రరూపం దాల్చడమే కాకుండా నది నుంచి రికార్డుస్థాయిలో 2,275 టి.ఎం.సి.ల అత్యంత విలువైన నదీ జలాలు వృధాగా సముద్రంలో కలిశాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు, ఆయకట్టు భూభాగాలను సైతం జలమయం చేసింది. వానాకాలం సీజన్ ప్రారంభమైన జూన్‌నెల ఒకటో తేదీ నుంచి ఈనెల 28వ తేదీ వరకూ 56 రోజులకే ఏకంగా 2275 టి.ఎం.సీ.ల గోదావరి నదీ జలాలు వృధా కావడం చరిత్రలో ఇది మొదటిసారని నీటిపారుదలశాఖాధికారులు అంటున్నారు. గోదావరి నదీ జలాలు రోజుకు సుమారు 200 టి.ఎం.సి.ల లెక్కన నాలుగు రోజులపాటు భారీగా వరదనీరు వృధాగా సముద్రంలో కలిశాయి. దవళేశ్వరం బ్యారేజి నుంచి 4,31,283 క్యూసెక్కులు, రాలి ఆయకట్ట నుంచి 2,48,562 క్యూసెక్కులు, మద్దుర్ బ్యారేజి నుంచి 1,29,496 క్యూసెక్కులు, విజ్జేశ్వరం బ్యారేజి నుంచి 1,50,443 క్యూసెక్కులు కలిపి ఉభయ గోదావరి జిలాల్లోని గోదావరి నదీ పాయల నుంచి మొత్తం 9.60 లక్షల క్యూసెక్కుల వరదనీరు సముద్రంలో కలుస్తోంది. సీజన్ ప్రారంభంలోనే భద్రాచలం పట్టణం ముంపునకు గురయ్యింది. భద్రాచలం వద్ద రికార్డుస్థాయిలో 71 అడుగుల వరద ప్రవాహం రికార్డు అయ్యింది. ఏకంగా పది రోజులపాటు మూడో ప్రమాద హెచ్చరికను దాటి వరద ప్రవాహం కొనసాగిందంటే గోదావరి నది ఎంత ఉధృతంగా, మరెంత ప్రమాదకరంగా ప్రవహించిందో అర్ధంచేసుకోవచ్చు. దవళేశ్వరం బ్యారేజివద్ద ఇంకనూ గోదావరి 9.60 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తూనే ఉంది. గోదావరి, దాని ఉపనదులన్నీ విస్తరించి ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలకు ఉపనదులన్నీ ఉగ్రరూపందాల్చి ప్రవహించాయి. గోదావరి నది ప్రవహిస్తున్న ఆరు రాష్ట్రాల్లో ఏకంగా 3,12,812 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరివాహక ప్రాంతం, ఆయకట్టు ఉన్నాయని, నది ప్రారంభమైన మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుంచి తూర్పున బంగాళాఖాతంలో కలిసే వరకూ 1465 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే ఈ నది అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 772 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుందని, అందుకే గోదావరి నదికి వరదలు వస్తే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికే నష్టం కూడా అధికంగానే ఉంటుందని ఆ అధికారులు వివరించారు. గోదావరి నదికి ఎగువన ఉన్న వార్ధా, ప్రవర, పెన్‌గంగ, వైన్‌గంగ నదులు భారీగా ప్రవహించడంతో తెలంగాణలోని శ్రీరాంసాగర్ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఎస్.ఆర్.ఎస్.పి.లోనికి ఇప్పటి వరకూ 205 టి.ఎం.సీ.ల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం సామర్ధం 90 టి.ఎం.సీ.లే కావడంతో మిగతా నీటిని దిగువనకు విడుదల చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, ఉత్తరతెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టులోనికి ప్రమాదకరమైన స్థాయిలో వరదనీరు వచ్చిచేరింది. కడెం ప్రాజెక్టు క్రెస్ట్‌గేట్ల నుంచి కేవలం మూడు లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు పంపించడానికి సామర్ధం ఉండగా జలాశయంలోనికి 5.25 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. దీంతో డ్యాంకు ఎడమవైపున ఉన్న మట్టికట్ట దెబ్బతిన్నది. మంజీరానదికి కూడా భారీగానే వరదనీరు వచ్చింది. సింగూరు జలాశయానికి ఇప్పటి వరకూ 15 టి.ఎం.సీ.ల వరదనీరు వచ్చి చేరింది. నిజాంసాగర్ జలాశయానికి 26 టి.ఎం.సీ.ల వరదనీరు చేరగా అందులో 17.80 టి.ఎం.సి.లతో పూరిస్తాయిలో నింపుకొని మిగతా నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి 480 టి.ఎం.సీ.ల వరదనీరు వచ్చినట్లు రికార్డయ్యింది. జలాశయంలో 14 టి.ఎం.సీ.లనీటిని నిల్వ చేసుకొని మిగతా నీటిని మొత్తాన్ని దిగువనకు విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజి, మిడ్ మానేరు, లోయర్ మానేరు జలాశయాలు కూడా పూర్తిస్థాయిలో నిండటమే కాకుండా అదనపు వరదను దిగువనకు విడుదల చేశారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టుల నుంచి మొత్తం 800 టి.ఎం.సి.ల గోదావరి నదీ జలాలు వృధాగా దిగువనకు విడుదల చేయాల్సి వచ్చింది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రాజెక్టులన్నీ భారీవరదనీటిని తీసుకురావడంతో ఆ నీరంతా కలిసి భద్రాచలం పట్టణాన్ని, ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలను ముంచెత్తింది. ఇలా గోదావరి నది నుంచి ఇప్పటి వరకూ 2275 టి.ఎం.సీ.ల విలువైన నదీ జలాలు వృధాగా సముద్రంలో కలిశాయి. ఈ నీటిని సద్వినియోగం చేసుకునే ఒక్క టి.ఎం.సీ. నీటిని పది వేల ఎకరాలకు ఖర్చు చేయగలిగితే రెండు కోట్ల 27 లక్షల ఎకరాలకు సాగునీరందించవచ్చునని అధికారులు వివరించారు.
2275 tmc water going waste from Godavari into Sea