ఆగస్టు 23న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థితో ఈ సంవత్సరం ఎనిమిది నెలల కాలంలోనే కోటాలోని శిక్షణ కేంద్రాల్లో అలా చనిపోయిన విద్యార్థులు సంఖ్య 23కి చేరింది. సగటున పది రోజులకు ఒకరు బలి అవుతున్నారన్నమాట. ఈ చావులకు దిగ్భ్రమ చెందిన జిల్లా యంత్రాంగం నివారణ చర్యలుగా వెంటనే రెండు నెలల పాటు అంతర్గత పరీక్షలను నిలిపివేయాలని కోచింగ్ సెంటర్లను ఆదేశించింది. గత నెలలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా కోటాలో పెరుగుతున్న విద్యార్థుల మరణాలపై ఒక కమిటీని వేసి విచారణకు ఆదేశించారు. తొమ్మిది, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవద్దని, వారు ముందు బోర్డు పరీక్షకు సంసిద్ధులు కావలసి ఉంటుందని, ఆ తర్వాతపై చదువుల కోచింగ్ విషయాన్ని ఆలోచించాలని గెహ్లాట్ సూచించారు. అయినా ఏడవ తరగతి నుంచే ఇక్కడ ఐఐటి కోచింగ్ మొదలవుతోంది.
రాజస్థాన్‌లోని ఒక జిల్లా కేంద్రమైన కోట అనే పట్టణం దేశంలోనే కోచింగ్ సెంటర్లకు ప్రధాన కేంద్రంగా వాసికెక్కింది. 1981 లో వికె బన్సాల్ అనే ఇంజినీర్ గణిత ట్యూషన్లు మొదలుపెట్టి కోటలో కోచింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఆయన దగ్గర నేర్చుకున్నవారికి ఐఐటిలో అధికంగా సీట్లు రావడంతో కోట పేరు మోగిపోయింది. ఆయన దగ్గర పని చేసినవాళ్లు విడిగా సెంటర్లు తెరవడంతో అక్కడ ఐఐటి కోచింగ్ సామ్రాజ్యం విస్తరించింది. కోట బ్రాండ్ ఇమేజిగా మారడంతో దేశంలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలన్నీ అక్కడ తమ శాఖలను తెరిచాయి. ఏటా లక్షలాది మంది విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ ఎంట్రెన్సులలో మంచి ర్యాంకు సంపాదించేందుకు అక్కడికి వెళుతుంటారు.
అయితే తల్లిదండ్రుల ఒత్తిడితోనే తామే ఇష్టపడో అక్కడ చేరాక అనుకున్న లక్ష్యాన్ని చేరలేమనే నిరాశతో, సెంటర్లు పెట్టే పరీక్షల్లో తగిన మార్కులు రానందు వల్లనో చాలా మంది విద్యార్థులు సతమతమవుతున్నారు. వారిలో కొందరు చదువులో నెగ్గలేక, ఇంటికి వెళ్లలేక, ఒత్తిడిని తట్టుకోక బలవంతంగా జీవితాన్ని చాలించుకుంటున్నారు. ఇదెంతో తీవ్రమైన అంశం. ఈ బలవన్మరణాలు వారి జీవించే హక్కుకు హరించడమే కాకుండా అందుకు ప్రేరేపించినవారు హంతకులతో సమానం. రాయని మరణ వాంగ్మూలంలో మొదటి ముద్దాయిలు వారి ఇంటి నుంచే మొదలవుతారు.
ఆగస్టు 23న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థితో ఈ సంవత్సరం ఎనిమిది నెలల కాలంలోనే కోటాలోని శిక్షణ కేంద్రాల్లో అలా చనిపోయిన విద్యార్థులు సంఖ్య 23 కి చేరింది. సగటున పది రోజులకు ఒకరు బలి అవుతున్నారన్నమాట. ఈ చావులకు దిగ్భ్రమ చెందిన జిల్లా యంత్రాంగం నివారణ చర్యలుగా వెంటనే రెండు నెలల పాటు అంతర్గత పరీక్షలను నిలిపివేయాలని కోచింగ్ సెంటర్లను ఆదేశించింది. గత నెలలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా కోటాలో పెరుగుతున్న విద్యార్థుల మరణాలపై ఒక కమిటీని వేసి విచారణకు ఆదేశించారు.
తొమ్మిది, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవద్దని, వారు ముందు బోర్డు పరీక్షకు సంసిద్ధులు కావలసి ఉంటుందని, ఆ తర్వాతపై చదువుల కోచింగ్ విషయాన్ని ఆలోచించాలని గెహ్లాట్ సూచించారు. అయినా ఏడవ తరగతి నుంచే ఇక్కడ ఐఐటి కోచింగ్ మొదలవుతోంది. రెగ్యులర్ పది, ఇంటర్ చదువు కోసం సెంటర్ల వారివే స్కూళ్లుంటాయి. వాటిలో విద్యార్థుల అడ్మిషన్లు ఉంటాయి గాని వారి హాజరు మాత్రం కోచింగ్ క్లాసుల్లో ఉంటుంది.
2022లో ‘కోట’ పెట్టే చదువుల బాధను తట్టుకోలేక 16 మంది ఆత్మహత్య చేసుకున్నారు.జనవరి 2019 నుండి డిసెంబర్ 2022 వరకు 52 మంది విద్యార్థులు కోటలో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఖ్యతో చలించిన రాజస్థాన్ ప్రభుత్వం ఆత్మహత్యల నివారణ కోసం ప్రైవేటు విద్యా సంస్థలపై నియంత్రణ కోసం ఓ బిల్లు తేవాలని గత డిసెంబర్‌లో ప్రకటించింది. అయితే ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు.
ఆ వయసులో ఇంటికి దూరంగా ఉండడమే ఓ కఠిన పరీక్ష కాగా, కోచింగ్‌లో ఒత్తిడి వల్ల ప్రెషర్ కుక్కర్ వాతావరణంలో విద్యార్థులు బతకాల్సివస్తోంది. వేలలో ఉన్న సీట్ల కోసం లక్షల మంది పోటీ పడ్డప్పుడు అపజయాల సంఖ్య సహజంగానే ఎక్కువగా ఉంటుంది. తమ స్కూళ్లలో, ఊర్లలో టాపర్‌లైన విద్యార్థులు కూడా మిగితా ప్రాంతాల నుంచి వచ్చిన మెరుగైన విద్యార్థులతో పోటీ పడలేక ఆత్మన్యూనతలోకి వెళ్ళిపోతారు. తమపై ఉన్న అంచనాలు తారుమారై, తల్లిదండ్రుల ఆశలను తీర్చలేక వివశులైన విద్యార్థులు చావుకు సిద్ధ్దపడుతున్నారు.
రోజుకు 16 నుండి 18 గంటల చదువు భారం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది. తమ మానసిక స్థితిపై అదుపు కోల్పోతున్నారు. స్కూల్ టాపర్ లేదా ఊరికే టాపర్‌గా నిలిచిన పిల్లలపైన తల్లిదండ్రులు ఆశలు ఎక్కువగా పెట్టుకుంటారు. దేశం లో ఎన్నో వేల స్కూళ్ళు, ఊర్లు.. ఆ లెక్కన ఎంతో మంది టాపర్లు వారిలో తమ పిల్లలొకరు అని వారు గ్రహించాలి.
ఇంతకాలం పిల్లలు ఒత్తిడి తట్టుకునేందుకు ఎలాంటి జ్ఞానబోధ చేపట్టకున్నా ఈ మధ్య కొన్ని సెంటర్లు యోగ క్లాసుల కోసం సమయం కేటాయిస్తున్నాయి.మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ, దేహ దారుఢ్యాలను అందించే జుంబా డ్యాన్సులను ఏర్పా టు చేస్తున్నారు. సంగీతం బీట్‌పై శరీరం అలసిపోయేలా స్టెప్పులు వేయడమే జుంబా డ్యాన్స్ విశేషత. కేవలం డబ్బులు పెట్టుబడిగా వెచ్చిస్తే చాలు తమ పిల్లలు అత్యుత్తమ ప్రజ్ఞావంతులుగా మారుతారని నమ్మకాన్ని పేరెంట్స్ వీడాలి. కనీసం విద్యావంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుతున్న సిలబస్‌ను, పాఠ్య పుస్తకాలను ఓసారి పరిశీలించాలి. వాటిలోని విషయం కాఠిన్యతని అవగాహన చేసుకోవాలి. తాము సాధించలేని దాన్ని తమ పిల్లలు సాధించి తమ ఆశలు నెరవేర్చాలనుకోవడం కన్న వారి క్రూరమైన కోరిక. సబ్జెక్టులోతు, పిల్లల స్తోమతను సరిగ్గా తూకం వేయకుండానే కోచింగ్ సెంటలోకి నెట్టేయడం అన్యాయం.
ఈ మధ్య జిల్లా కలెక్టర్, పోలీస్ ఆదేశాల మేరకు కోట కోచింగ్ సెంటర్లలో, హాస్టల్ గదుల్లో ఫ్యానుకు ఉరి పోసుకోకుండా ఫ్యాన్ వేలాడి తిరిగే లోహ కడ్డీకి బదులుగా స్ప్రింగును బిగిస్తున్నారు. మేడపై నుంచి దూకినా నేలపై పడకుండా ప్లాస్టిక్ వలను చుట్టూ అమర్చుతున్నారు. మెదడులో తొలిచే చావు తలంపును తుంచివేయకుండా ఇలాంటి విధానాలు చేపట్టడం మరీ దుర్మార్గం. మరణం మినహా మార్గాంతరం లేని మనస్థితిలో విలవిలలాడుతున్న విద్యార్థులను తమదైన రీతిలో బతికే స్వేచ్ఛనీయాలి. కోచింగ్ సెంటర్లలో చదివే గంటలను విద్యార్థులు మానసిక సంతులనకు సరిపడేలా మార్చడం, విద్యార్ధి ఇషాయిష్టాలను పట్టించుకొని వెసులుబాటును ఈయడం, పరీక్షల సంఖ్యను తగ్గించడం, మార్కులతో విద్యార్ధి స్థానాన్ని బహిర్గతం చేయకుండా వెనుకబడ్డ వారికి ప్రత్యేక తరగతులు పిలల్ల అనుకూల సమయాల్లో నిర్వహించడం చేయాలి. కోచింగ్ సెంటర్లు పిల్లల మేధస్సును పరీక్షించకుండానే వ్యాపార దృష్టితో వచ్చిన వారందరికీ అడ్మిషన్లు ఈయడం పద్ధతి కాదు. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా అడ్మిషన్లు ఈయాలని జిల్లా కలెక్టర్ చెప్పినా సెంటర్లు పట్టించుకోలేదు.
కోచింగ్ సెంటర్లు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యాశాఖ పరిధిలో విద్యావేత్తల, మానసిక వైద్యుల కమిటీ సూచించిన విధంగా నడిచేలా విధివిధానాలు రూపొందించాలి. స్టడీ అవర్స్ కుదించి మానసికోల్లాసానికి సమయం కేటాయించాలి. ప్రతి వారం కౌన్సిలింగ్ తరగతులు ఏర్పాటు చేసి విద్యార్ధి మనసులోని మాటని తల్లిదండ్రులకు చేరేలా చెయ్యాలి. డాక్టర్ నో, ఇంజినీర్ నో చేయడానికే పిల్లలను కనలేదెవ్వరు. ఇతర వృత్తుల్లో, ఉద్యోగాల్లో కోట్ల మంది యువతీ యువకులు ఘనంగా, విజయవంతంగా బతుకుతున్నారు. పోయినాక ఇలా చేస్తారనుకోలేదు అని నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చే కన్నా పిల్లలు తమ ఇష్టంగా బతికే స్వేచ్ఛనీయాలి. ప్రభుత్వం యంత్రాంగాలు, కోచింగ్ వ్యాపార కేంద్రాలు నిమిత్త మాత్రమే. పిల్లలను కన్నవారి అసలైన నిర్ణేతలు. అక్కడ ఇంకొక్క చావు పెరిగినా ఆ హంతకులు తల్లిదండ్రులే!.
బి.నర్సన్
9440128169