షేక్ హసీనా ప్రభుత్వ పతనానంతరం సోమవారం నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసాకాండ, అల్లర్లలో 232 మంది హత్యకు గురైనట్లు గురువారం పత్రికా వార్తలు తెలిపాయి. జులై రెండవ వారంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలలో మరణించిన వారితో కలుపుకుంటే ఇప్పటి వరకు 560 మంది పౌరులు మరణించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. బుధవారం 21 మంది హత్యకు గురికాగా మంగళవారం 232 మంది మరణించారు. మంగళవారం కషింపూర్ హైసెక్యూరిటీ కారాగారం నుంచి 209 మంది ఖైదీలు పరారయ్యారు.
పారి పోతున్న ఖైదీలను పట్టుకునే క్రమంలో కారాగార భద్రతా సిబ్బంది జరిపిన కాల్పులలో ముగ్గురు తీవ్రవాదులతోసహా ఆరుగురు మరణించారు. భద్రతా సిబ్బందిపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో విధులలో చేరడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో పోలీసు సిబ్బంది విధులలో చేరేందుకు వీలుగా ప్రజలు సహకరించాలని పోలీసు ప్రధాన కార్యాలయం విజ్ఞప్తి చేసింది. గత మూడు రోజులుగా రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు ఎవరూ కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తామే ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. ఇలా ఉండగా దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిన ఆవామీ లీగ్‌కు చెందిన ఇద్దరు నాయకులను చువదంగలోని దర్శన ఐసిపి చెక్ పోస్టు వద్ద బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్(సిసిబి) బుధవారం అదుపులోకి తీసుకుంది. భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్నారు.