పాట్నా : బీహార్‌లో కల్తీసారా కాటుకు కనీసం 24 మంది దుర్మరణం చెందారు. రాష్ట్రంలోని వెస్ట్ చంపారన్, గోపాల్‌గంజ్ జిల్లాల్లో దీపావళి పండుగ వేడుకల దశలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. బీహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే మద్యపాన నిషేధం విధించింది. దీనితో ప్రజలు పండుగలు పబ్బాల దశలో దొడ్డిదారిన దొరికే కల్తీసారా, ప్రమాదకర నాటు సారా సేవనానికి దిగుతున్నారు. ఈ దిశలోనే ఇప్పుడు కల్తీసారా తాగి జనం మృతి చెందారు. గురువారం చంపారన్ జిల్లాలో ఎనమండుగురు కల్తీ సారా తాగి మృతి చెందారని జిల్లా ఎస్‌పి ఉపేంద్ర నాథ్ వర్మ తెలిపారు. తెల్హూవా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గోపాల్‌గంజ్ జిల్లాలో ఏకంగా 16 మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ చౌదరి తెలిపారు. ఇక్కడి మరణాలు బుధవారం, గురువారం చోటుచేసుకున్నాయి. నాటుసారా తాగి అనారోగ్యం పాలయిన పలువురిని ఆసుపత్రికి చేర్చి చికిత్సలు జరుపుతున్నారు. అయితే కల్తీ మద్యంలో అత్యంత ప్రమాదకర నిషాకారక విషపూరిత పదార్థం ఉందని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. పోస్టుమార్టం నివేదిక తరువాత కానీ మృతికి కారణాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చే అవకాశం లేదని తెలిసింది. కల్తీ మద్యం ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలని , కారకులను శిక్షించాలని ఆదేశించారు.
బీహార్‌లో కల్తీసారా కాటు
- Advertisement -
- Advertisement -
- Advertisement -