Monday, January 20, 2025

కెసిఆర్ నాయకత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట :సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పులిజాల గ్రామంలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత విద్యుత్‌లో రాష్ట్రం దేదీప్యమానంగా వెలుగొందుతుంటే పరాయి పాలకులు, కిరాయి నేతల కాంగ్రెస్ పార్టీ కళ్లు మండుతున్నాయని ఆయన విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి చంద్రభూతం లెక్క తెలంగాణను పట్టుకుని పీడిస్తున్న పెనుభూతంగా మారాడని రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారని ఆయన గుర్తు చేశారు.

ఈ వెలుగులను ఆర్పాలని, రైతులను చీకట్లో పాము కాటుకు, కరెంట్ షాక్‌కు బలి చేయాలని, తెలంగాణ వ్యవసాయాన్ని తేరుకోకుండా చేయాలని, అధికారం హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఉచితంగా కరెంట్ ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, రైతు బంధుతో పెట్టుబడి సాయం అందించి, రైతు బీమా తీసుకొచ్చి, రైతు వేదికలు నిర్మించి, రైతు కల్లాలు ఏర్పాటు చేసి, పండిన పంటను కొనుగోలు కేంద్రాలతో ధాన్యం మొత్తం సేకరించి తెలంగాణ రైతులు మూడు పంటలతో ముచ్చటగా మురిసిపోయేటట్లు చేస్తున్నారని వివరించారు.

అమెరికాలో కాంగ్రెస్ రైతు వ్యతిరేక కుట్రలు రేవంత్ రెడ్డి రూపంలో బయటపడడంతో తెలంగాణ రైతులు భగ్గు మంటున్నారని, కరెంట్ వ్యతిరేక కాంగ్రెస్ తీరుపై రైతన్నలు కదం తొక్కుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, ఎల్లమ్మ ఆలయం నిర్మాణాలకు సహాయ సహకారాలు అందజేస్తున్నానని, విద్యుత్ సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి అరుణ, మండల పార్టీ అధ్యక్షుడు పర్వతాలు ముదిరాజ్, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, రామాచారి, రవీందర్ రెడ్డి, రవి, మల్లేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News