Monday, December 23, 2024

మూడు గంటల ముసలం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కారు చీకట్లో మగ్గాల్సి వస్తుందనే భయం ఊరూరా వెంటాడుతున్నది. నాటి పాముకాటు మరణాలు, తేలు కాటు చావులు, అర్థరాత్రి బాయిల కాడ నిద్రలు తదితర భయానక అనుభవాలను నెమరు వేసుకోవాల్సిన దుస్థితిని ఆ పార్టీ వైఖరి గుర్తు చేస్తున్నది. రేవంత్ వ్యాఖ్యలతో అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా రేవంత్ వ్యవహార శైలిలో మార్పు లేకపోగా ఇంకా కరెంట్ సరఫరాపై, రైతాంగానికి అందుతున్న పథకాలపై అదే పంథాను కొనసాగిస్తుండడం వెనుక ఆ పార్టీ నైజం మరోసారి బయటపడిందన్న చర్చే జరుగుతున్నది. అంటే ఎకరానికి గంట చొప్పున విద్యుత్ ఇవ్వాలన్నది ఆ పార్టీ విధానమని తేటతెల్లమవుతున్నది.

ప్రతిసారి ఎన్నికల్లో ప్రభుత్వాలు కూలిపోవాలన్నా, కొత్త పార్టీ అధికారంలోకి రావాలన్నా ఆరు దశబ్దాల నుండి విద్యుత్ సమస్యే ప్రధానమవుతున్నది. అధికార, విపక్ష పార్టీల మధ్య అసెంబ్లీ సాక్షిగా కరెంట్ మంటలు చెలరెగడం ఆనవాయితీగా వస్తుండేది. పార్టీల గెలుపోటములను కూడా విద్యుత్ అంశమే ప్రభావితం చేసిన సందర్భాలూ ఉన్నాయి. విద్యుత్ చార్జీలు పెంచి చంద్రబాబు తన సర్కారును తానే కూల్చుకోగా, కాంగ్రెస్ పార్టీ కూడా అదే కరెంట్ సమస్యతో తెలంగాణ ఉద్యమ జటిలానికి, టిఆర్‌ఎస్ బలోపేతానికి అవకాశం ఇచ్చింది. అంటే ప్రతిసారి ఎన్నికల్లో కరెంటు అంశమే ప్రధాన ఎజెండగా వస్తున్నది.

కరెంట్ ఆధారంగా సాగే వ్యవసాయ రంగాన్ని ఆయా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేస్తే 2014 తర్వాత టిఆర్‌ఎస్ విద్యుత్‌ను ముఖ్యంగా వ్యవసాయాన్ని పండుగలా ఆదరిస్తూ రైతన్నలకు బాసటగా నిలుస్తున్నది. గత టిడిపి, కాంగ్రెస్ ఘోర కరెంట్ వైఫల్యాలను కళ్లారా చూసి నిరసన వ్యక్తం చేసిన కెసిఆర్ స్వరాష్ట్రంలో విద్యుత్‌కే తొలి ప్రాధాన్యతనిచ్చి 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నారు. పల్లెల నుండి పట్టణాల దాకా రెప్పపాటు విద్యుత్ కోతల్లేకుండా చూస్తున్నారు. రాష్ట్రం అప్పులపాలైనా రైతాంగం చిరునవ్వుతో ఉండాలని పక్క రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి మరీ తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందచేస్తుండడం సజీవ వర్తమాన చరిత్రకు సాక్ష్యంగా చెప్పొచ్చు. 24 గంటల విద్యుత్ సరఫరాను కళ్లారా చూసిన జనం 2018 ఎన్నికల్లో మళ్లీ టిఆర్‌ఎస్‌కే జై కొట్టి రెండోసారి కెసిఆర్‌కే పట్టంగట్టారు. ఇక 2023 ఎన్నికల్లో కూడా మళ్లీ విద్యుత్‌కే జనం ప్రాధాన్యతనివ్వక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ మూడు గంటలు, బిఆర్‌ఎస్ మూడు పంటల నినాదం పల్లెపల్లెకు పాకిపోయింది.

కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేని పరిస్థితి ఉందని ఇటీవల విశ్లేషకులే చెబుతున్నారు. అర్జంటుగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో పలు విధానాలపై జనాల్లో చర్చపెట్టే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ అగ్రజులు రాహుల్, ప్రియాంకలు స్వయంగా డిక్లరేషన్లు ప్రకటించి వెళ్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్‌లో స్వయాన రాహుల్ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో రైతులకు గిట్టుబాటు ధర, పంటలు, రైతుల సమస్యలు చెప్పుకొచ్చారే తప్పా 24 గంటల ఉచిత విద్యుత్‌పై అంతగా చెప్పినట్టు లేదు. అయితే ఇదే విధానాన్ని ఇటీవల పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. తెలంగాణలో అమలవుతున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ను మీరు తూచా తప్పకుండా అమలు చేస్తారా లేదా అన్న ప్రశ్నకు రైతులకు 24 గంటలు అవసరం లేదని ఆయన స్పష్టం చేస్తూనే తెలంగాణలో ఒక ఎకరం పొలం పారాలంటే ఒక గంట విద్యుత్ సరఫరా సరిపోతుంది… మూడు ఎకరాలకు మూడు గంటలు చాలని ఆయన స్పష్టంగా విడమరచి చెప్పారు.

అంటే కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ఆయన కుండబద్దలు కొట్టేశారు. అంతకు ముందు అవసరం అనుకుంటే సీతక్క కూడా సిఎం రేసులో ఉంటుందని స్వయాన పిసిసి చీఫ్ హోదాలో చెప్పుకొచ్చారు. అంటే రాజకీయాలు, వ్యూహాలు, ఆ పార్టీ విధానాలేంటని చర్చ పెట్టడానికి రేవంత్ తాలుకూ అమెరికా డిక్లరేషన్లు చాలు. తెలంగాణ రైతాంగం నుండి క్షేత్ర స్థాయిలో మిన్నంటుతున్న నిరసనలు చూసిన రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణపై తానే రంగంలోకి దిగాలనకున్నారు. అందుకే వరుసగా పరుష పదజాలంతో కెసిఆర్‌పై ఒంటికాలిమీద లేచి తన కడుపులో ఉన్న అక్కసంతా వెళ్ళగక్కారు. అయితే బషీర్‌బాగ్ కాల్పులకు కారణం కెసిఆరేనని మరో బాంబు పేల్చిన రేవంత్ నవ్వుల పాలయ్యారు. అసలు చంద్రబాబుకు కెసిఆర్ లొల్లి పుట్టిందే కరెంట్ విషయంలోనని, డిప్యూటి స్పీకర్ హోదాలో కరెంట్ లేఖ రాసి రాజీనామాలు సమర్పించి ఉద్యమాన్ని ఆరంభించారన్న వాస్తవాన్ని మరిచారు.

దీంతో 23 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న తెలుగుదేశం పార్టీ అధినేత, నాటి సీఎం చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగిన చేదు నిజాలను తవ్వుతున్నారు. ఆ రోజు బషీర్‌బాగ్ చౌరస్తాలోని ఫ్లై ఓవర్ కింద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి అశ్విక దళాలు సైతం కదంతొక్కిన కఠోర సత్యాలను, లాఠీచార్జీలు, భాష్పవాయుగోళాలను గుర్తు చేస్తున్నారు. అంతకుముందే డిప్యూటి స్పీకర్ హోదాలో ఇదే కరెంట్ చార్జీలపై కెసిఆర్ నాడు చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాసి తన నిరసనను తెలియచేశారు. చంద్రబాబు వైఖరిలో మార్పు లేకపోవడంతో ఇదే కరెంట్ అస్త్రంతో తెలంగాణ ఉద్యమాన్ని ఆరంభించి డిప్యూటి స్పీకర్ పదవికి, ఎంఎల్‌ఎకు రాజీనామా అందచేసి ఉద్యమాన్ని వ్యూహాత్మకంగా కొత్త పుంతలు తొక్కించారు. నాటి నుండి నేటి వరకు కెసిఆర్ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా వ్యూహాత్మకంగా ఉంటుంది.

ఇవాళ కరెంట్ పై అడ్డగోలుగా మాడ్లాడిన కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టాల్సిన అవసరాన్ని రైతాంగం గుర్తు చేస్తున్నది.గత, వర్తమాన చరిత్ర కలబోతగా సాగుతున్న కెసిఆర్ హయాంలో ఇవాళ రైతులకు వ్యవసాయం ఓ పండుగులా పరిఢవిల్లుతున్నదన్నది నిజం. కాళేశ్వరం జలాలైనా, 24 గంటల ఉచిత విద్యుత్ అయినా రైతు బంధు, రైతు బీమా సాయమైనా, పంటల కొనుగోళ్లైనా… ఏదైనా నాటి నేటి వ్యవసాయానికి నక్కకు నాగలోకానికి తేడా అన్నది క్షేత్రస్థాయి నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. అయితే సాధారణ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య రచ్చ సహజమే అయినా రైతాంగం మాత్రం పాళ్లను నీళ్లను వేరు చేస్తున్నది. రాబోయే సర్కారు మళ్లీ బిఆర్‌ఎస్‌దేనని, ముచ్చటగా మూడోసారి కెసిఆర్ చేతికే పగ్గాలొస్తాయని తాజాగా అనేక సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్న సందర్భంలో పిసిసి చీఫ్ హోదాలో ఉచిత కరెంట్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఎంత నష్ట నివారణ చేసినా ఆ పార్టీకి ఉరి తాళ్లేనని చెప్పక తప్పదు.

వెంకట్ గుంటిపల్లి
9494941001

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News