Sunday, December 22, 2024

నిరంతరాయంగా 24 గంటల కరెంటు!

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామని వాగ్దానం చేసినా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కాలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ శాఖ రైతులకు రాత్రిపూట విద్యుత్ సరఫరా చేసేది. దీంతో పలువురు రైతులు రాత్రిపూట పంపుసెట్లు ఆన్ చేసేందుకు పొలాల్లోకి వెళ్తుండగా విద్యుదాఘాతం లేదా పాముకాటుకు గురై మృతి చెందేవారు. పవర్ హాలిడేలతో పరిశ్రమలు కునారిల్లిపోయేవి.పారిశ్రామికవేత్తలు ధర్నాకు దిగాల్సిన దయనీయ పరిస్థితి దాపురించి ఉండేది. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకార అవుతుందని, తీగెల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మార్గదర్శనంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించింది. ఇప్పుడు దేశానికే ఆదర్శం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దాదాపు మూడున్నరేండ్ల కాలంలో పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా సిఎం కెసిఆర్ తీసుకున్న చర్యల కారణంగా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్తు పంపిణీ ప్రారంభమైంది.

వ్యవసాయ వినియోగదారులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటి, గతంలో ఉమ్మడి ఎపిలో వ్యవసాయ రంగానికి పగలు 3 గం., రాత్రి 3 గం టలు విద్యుత్తు సరఫరా అయ్యేది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుంది. 26.96 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలు బలోపేతం చేయబడ్డాయి.రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసింది, రాష్ట్రం ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 18,453 మెగావాట్లు. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.12,727 కోట్లు కేటాయించి, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.1,500 కోట్లకు పెంచింది.విద్యుత్ తలసరి వినియోగం 2014-15లో 1,356 యూనిట్లుగా ఉంది. 2021-22 నాటికి ఇది 2,126 యూనిట్లకు పెరిగింది.

దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూనిట్లు. 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగూడెం పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. సింగరేణి కాలరీస్ నిర్మించిన 1200 మెగావాట్ల సామర్థ్యంతో మంచిర్యాలలోని జైపూర్ పవర్ ప్లాంట్ కూడా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. విద్యుత్తును అదనంగా అందుబాటులోకి తెచ్చింది. జూరాల, పులిచింతల నుంచి 360 మెగావాట్ల హైడల్ పవర్ సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ స్టేషన్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో టీఎస్ జెన్కో దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. రైతులకు ఎంత చేసినా తక్కువే అని సిఎం కెసిఆర్ ఎప్పుడూ చెప్తుండే మాట. నిజానికి సాగునీరు, పెట్టుబడి, కావాల్సినంత విద్యుత్తు అందుబాటులో ఉంటే.. రైతులు బంగారం పండిస్తారనేది సిఎం అపారమైన నమ్మకం. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. గత 9 సంవత్సరాలలో అన్ని వర్గాలకు రూ. 39,321 కోట్లతో సరఫరా పంపిణీ వ్యవస్థలకు బలోపేతం చేయడంతో రాష్ట్రంలోని వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110 యూనిట్లు ఉంటే 2023 మార్చి 31 నాటికి 2126 యూనిట్లుకు చేరింది.

జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది. ఇది రాష్ట్ర ప్రగతికి నిదర్శనం. రాష్ట్రంలో 2.47% అతి తక్కువ సరఫరా నష్టాలతో తర్వాత 99.98% ట్రాన్స్‌మిషన్ అవైలబిలిటీతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించింది. రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు 101 యూనిట్ల వరకు ప్రతి నెలా 5,96,6 42 మంది ఎస్‌సి వినియోగదారులకు, 3,21,736 మంది ఎస్‌టి వినియోగదారులకు 2017 నుండి ఇప్పటి వరకు రూ. 656 కోట్ల విలువగల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వడం జరిగింది. 29,365 నాయీ బ్రాహ్మణులకు సెలూన్‌లకు, 56,616 లాండ్రీ షాపులకు ప్రతి నెలా 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది. 6667 పౌల్ట్రీ యూనిట్స్, 491 పవర్ లోమ్స్‌కు యూనిట్‌కి రెండు రూపాయల సబ్సిడీ ఇస్తుంది. 24 గంటల విద్యుత్తుపై తెలంగాణ ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధి, నిబద్ధతకు ఇదే నిదర్శనం. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కరెంటు ఎప్పుడు వస్తదో పోతదో భగవంతుడికే ఎరుక. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు వర్ధిల్లుతుండే. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఐదారేండ్ల నుంచి 24 గంటల విద్యుత్తు అందుతున్న ఒకే ఒక్క రాష్ట తెలంగాణ. ఎన్నికల కోసం కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంటు ఎందుకు? రైతులకు 3 గంటలు సరిపోతుంది అన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే ధోరణిలో మాట్లాడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News