Monday, December 23, 2024

24 గంటల విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పుణ్యమే

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని పట్టభద్రుల ఎంఎల్‌సి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి ఎడ్లు తెల్వదు… వడ్లు తెల్వదని అని మాట్లాడిన కెటిఆర్‌కు ఎడ్లు, ఎవుసం తెలుసా అని ప్రశ్నించారు.

పూటకో మాట మాట్లాడటం, వాస్తవాలను వక్రీకరించడం రాహుల్‌గాంధీకి తెలియదన్నారు. ఉచిత విద్యుత్ ప్రారంభించినప్పుడు కెటిఆర్ ఎక్కడ ఉన్నాడని, ఉచిత విద్యుత్ అంశంపై కనీస అవగాహన ఉందా అన్ని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేపట్టి దేశ సమైఖ్యత కోసం కృషి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ అని, ఎన్నికల్లో వాగ్ధానం చేయకపోయినా రైతులను రుణ విముక్తులను చేసేందుకు ఏక కాలంలో రుణ మాఫీ చేశామన్నారు.

రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు రూ.5 వేల ప్రోత్సాహాన్ని అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి పంటకు సరిపడా ఇచ్చామన్నారు. విద్యుత్ కనెక్షన్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని గుర్తు చేశారు. రైతులు పండించిన వడ్లను కళ్లాల వద్దే కొనుగోలు చేశామని, దేశంలో ఎక్కడా ఉచిత విద్యుత్ లేనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. రుణమాఫీ పేరిట బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిపోయినా రుణ మాఫీ చేయలేదని, తొమ్మిదేళ్ల నుంచి 4 శాతం వడ్డీ రాయితీ చెల్లించలేదన్నారు.

విత్తన రాయితీ, రుణ మాఫీ అమలు చేయకపోవడంతో వడ్డీ భారం రైతులపై పడుతోందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ప్రకటనలకే పరిమితమైంది తప్పా ఎక్కడా కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని, ఉచిత విద్యుత్ పేరిట అవినీతికి పాల్పడుతున్నారని అన్న రేవంత్‌రెడ్డి మాటలను బిఆర్‌ఎస్ నేతలు వక్రీకరించారన్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని తాము ఆందోళనలు చేస్తే కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని ఇప్పుడు రాత్రి పూట కూడా కరెంట్ ఇస్తున్నారన్నారు.

చంద్రబాబు కాలం నుంచి విద్యుత్ సరఫరాపై ఫైళ్లు బయట పెడతామంటున్న మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఇంతవరకు ఎందుకు ఫైళ్లు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. సిఎండి ప్రభాకర్‌రావు పట్ల తమకు విశ్వాసం ఉందని, ఈ ఆరు నెలలుగా వ్యవసాయానికి ఎన్ని గంటలు కరెంట్ సరఫరా చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్‌కుమార్, నాయకులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గిరి నాగభూషణం, బండ శంకర్, మేడిపల్లి సత్యం, దుర్గయ్య, జీవన్, రాజేందర్, మునింధర్‌రెడ్డి తదిరతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News