ఢాకా: బంగ్లాదేశ్ లోని పంచగఢ్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. కరాటోవ నదిలో పడవ మునిగి 24 మంది మృతి చెందారు. మరో 30మంది గల్లంతయ్యారు. ఉత్తర పంచగఢ్ లో ఈ ప్రమాదం జరిగిందని జిల్లా అధికారి జహరుల్ ఇస్లాం చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దుర్గామాత ఆగమనం ప్రారంభానికి సంకేతంగా వచ్చే మహాలయ పర్వదినం సందర్భంగా పంచగఢ్ లోని బోదేశ్వరి ఆలయ సందర్శనానికి బోధ, పంచ్‌పిర్, మరియా, బంఘారీ ప్రాంతాలకు చెందిన హిందూ భక్తులు పడవలో బయలు దేరారు. ఆలిగఢ్ ప్రాంతానికి చేరుకోగానే వారి పడవ కరాటోవ నదిలో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. అప్రమత్తమైన యాత్రికులు కొందరు ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకోగా, చాలా మంది చిన్నారులు, మహిళలు నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 24 మృతదేహాలను గుర్తించారు. మరో 30 మంది కోసం గాలిస్తున్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. పడవలో పరిమితికి మించి ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో పడవలో 70 మందికి పైగా ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
24 killed after boat drowned in Bangladesh