సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల పరిధిలోని బీబీపేట జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉడికీఉడకని గుడ్లు, నీళ్లచారు, కచ్చపక్కా అన్నం తినడం వల్లే ఈ సంఘటన జరిగిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేధన వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థులను 108 అంబులెన్స్‌లో ఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 114 మంది విద్యనభ్యసిస్తున్నారు. కాగా సోమవారం 92 మంది విద్యార్థులు హాజరు కాగా మధ్యాహ్నం భోజనం తిని 24 మంది అస్వస్థతకు గురయ్యారు. బీబీపేట జడ్‌పిహెచ్‌ఎ స్‌లో సోమవారం మధ్యాహ్న భోజనం వికటించి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.నర్సింగ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా, ఉడికీ ఉడకని గుడ్లు తినడం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు జిల్లా అధికారులు నిర్దారించారు.