ముంబై: ఎయిర్ ఇండియాకు చెందిన 24 ఏళ్ల ఫ్లయిట్ అటెండెంట్ ఒకరు ముంబైలోని తన అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో హత్యకు గురయ్యారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముండైకు వచ్చిందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నగర శివార్లలోని అంధేరీకి చెందిన మరోల్ ప్రాంతంలోని కృష్ణలాల్ మార్వా మార్గ్‌లో ఉన్న ఎన్‌జి కాంప్లెక్స్‌లోని ఒక ఫ్లాట్‌లో ఆదివారం రాత్రి ఆమె హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తిపై హత్య కేసు నమోదు చేసిన పోవై పోలీసులు నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
రూపాల్ తన సోదరి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలసి ఆ ఫ్లాట్‌లో ఉంటున్నారని, సోదరి, ఆమె బాయ్‌ఫ్రెండ్ 8 రోజుల క్రితం తమ స్వస్థలానికి వెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది. రూపాల్ హత్య గురించి వెంటనే ఆమె కుటుంబానికి సమాచారం అందించినట్లు ఆ అధికారి చెప్పారు. శనివారం రూపాల్‌కు ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఆమె స్పందించకపోవడంతో ముంబైలో నివసిస్తున్న తమ స్నేహితులకు ఫోన్ చేసి ఫ్లాట్‌కు వెళ్లి చూడాల్సిందిగా కోరారు. దీంతో స్థానిక మిత్రులు ఫ్లాట్‌కు వెళ్లి డోర్‌బెల్ కొట్టగా స్పందన లేకపోవడంతోపాటు లోపల నుంచి లాక్ చేసి ఉంది.
దీంతో వారు పోవై పోలీసులకు సమాచారం అందచేయగా వారు వచ్చి డూప్లికేట్ కీ సాయంతో తలుపులు తెరిచారు. లోపల రూపాల్ మృతదేహం కనిపించింది. ఆమె మెడపై కత్తి గాట్లు ఉన్నాయి. మవెంటనే పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరనించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.