Saturday, September 21, 2024

“భయం” కరోనా

- Advertisement -
- Advertisement -

 Corona Cases

 

ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్‌కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు తొమ్మిది 11,506 కేసులతో మహారాష్ట్ర టాప్ సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌లో 222 మందికి వైరస్ ఢిల్లీలో ఒకే బిల్డింగ్‌లో 44 మందికి పాజిటివ్ యుపిలో ఆరుగురు వలస కూలీలకు కరోనా

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శనివారం కొత్తగా 2441 కేసులు నమోదయ్యా యి. దీంతో దేశంలో మొత్త కేసుల సంఖ్య 37,776కు చేరుకుంది. వీరిలో 10,017మంది కోలుకోగా, 1,223 మంది వైరస్‌కు బలయి ప్రాణాలు కోల్పోయారు. శనివారం కొత్తగా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా దేశంలో కరోనా వైరస్ తొలిసారిగా వెలుగు చూసిన తర్వాత ఒక్క రోజులో ఇంత మంది కరోనా బాధితులు నమోదు కావడం ఇదే మొదటి సారి. కాగా ఇప్పటివరకు కరోనా రోగుల్లో కోలుకున్న వారి శాతం26.52గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి శనివారం విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. కాగా తాజాగా సంభవించిన మరణాల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 26 మంది చనిపోగా, గుజరాత్‌లో 22మంది, మధ్యప్రదేశ్‌లో 8మంది, రాజస్థాన్‌లో నలుగురు, కర్నాటకలో ముగ్గురు, ఢిల్లీ, యుపిలలో ఇద్దరేసి, బిహార్, హర్యానా, పంజాబ్, తమిళనాడులలో ఒక్కొక్కరు చనిపోయారు. కాగా దేశం లో వెయ్యికి పైగా కేసులు కలిగిన రాష్ట్రాల సంఖ్య 9 కి చేరుకుంది.11,506 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది.

అక్కడ ఇప్పటివరకు 485 మంది వైరస్‌కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యుపి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. కాగా మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లో ఎక్కువ మరణాలు సంభవించాయి. అక్కడ ఇప్పటివరకు 236 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో 145మంది, రాజస్థాన్‌లో 62, ఢిల్లీలో 61, యుపిలో 43 ,పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో చెరి 33 చొప్పున మరణాలు సంభవించాయి. గుజరాత్‌లో గత 24 గంటల్లో 333 కొత్త కేసులు నమోదైనాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5054కు పెరిగింది. తమిళనాడులో శనివారం కొత్తగా 231 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇందులో ఒక్క చెన్నై నగరంలోనే 174 కేసులు రావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2757కు పెరిగినట్లు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు పంజాబ్‌లో ఒక్క రోజే 187 కేసులు నమోదైనాయి. ఒక్క అమృత్‌సర్‌లోనే 53 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 772కు చేరుకుంది.

కేరళలో రెండే కేసులు
మరో వైపు కేరళలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శనివారం అక్కడ కేవలం రెండు కేసులు మాత్రమే నమోదైనాయి. ముఖ్యమంత్రి పినరయి విఇజయన్ ఈ విషయం చెప్పారు. వయనాడ్, కన్నూర్ జిల్లాల్లో ఈ కేసులు నమోదైనాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 96 గా ఉన్నాయి. మరో వైపు కేంద్రం అనుమతించినప్పటికీ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతించబోమని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది.

122 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లకు కరోనా
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉన్న సిఆర్‌పిఎఫ్ 31వ బెటాలియన్‌లో ఇప్పటివరకు 122 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. మరో వంద మంది ఫలితాలు రావలసి ఉందని వారు తెలిపారు. గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో వారు ఉంటున్న మయూర్ విహార్ ఫేజ్3 ప్రాంతాన్ని ఇప్పటికే పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. వీరందరినీ మండోలిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం కొత్తగా12 మందికి వైరస్ సోకినట్లు గుర్తించామని తెలిపారు.ఈ వారం మొదట్లో 55 ఏళ్ల వయసుప్న ఓ సిఆర్‌పిఎఫ్ ఎస్‌ఐ కరోనా కారణంగా మృతిచెందిన విషయం తెలిసిందే. సెలవుపై వెళ్లివచ్చిన ఓ కానిస్టేబుల్‌నుంచే బెటాలియన్‌లోని మిగతా వారికి ఈ వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

యుపిలో ఆరుగురు వలస కూలీలకు వైరస్
లక్నో: వివిధ రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించడానికి కేంద్రం అనుమతించి రెండు రోజులు తిరక్క ముందే రాష్ట్రాలకు కొత్త సమస్య వచ్చి పడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో మహారాష్ట్రనుంచి తిరిగి వచ్చిన ఏడుగురు వలస కూలీలకు కరోనా వైరస్ సోకింది. వీరంతా బస్తీ జిల్లాలోని ఓ కళాశాలలో క్వారంటైన్‌లో ఉంటున్నారు. వారం క్రితమే వీరంతా మహారాష్ట్రనుంచి యుపికి వచ్చారు. ఇప్పుడు వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వారంటైన్ సెంటర్‌ను శానిటైజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరితో సన్నిహితంగా ఉన్న వారినందరినీ గుర్తించి ఐసొలేట్ చేయడం జరుగుతున్నట్లు వారు చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుపడిన యుపికి చెందిన వలస కూలీలు స్వరాష్ట్రానికి తిరిగి రావడం మొదలైనతర్వాత వారిలో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ సోకడం ఇదే మొదటి సారి. దేశం నలుమూలల్లో చిక్కుపడిన యుపికి చెందిన లక్షలాది మంది వలస కూలీలంతా స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్న విషయం తెలిసిందే.

ఢిల్లీలో ఒకే బిల్డింగ్‌లో 44మందికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఆగ్నేయ ఢిల్లీలోని కపాషూరా ప్రాంతంలో ఒకే బిల్డింగ్‌లో ఉన్న 44 మందికి కరోనావైరస్ సోకింది. ఈ బిల్డింగ్‌లో ఉంటున్న ఓ వ్యక్తికి గత ఏప్రిల్ 18వ తేదీన కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేసి దానిలో ఉన్న175 మంది శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపించారు. శనివారం 67 మంది ఫలితాలు రాగా వీరిలో 44 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి ఫలితాలు కూడా వస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకు 3,738 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా 61 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం కొత్తగా 223 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

2,411 New Corona Cases Registered in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News