ఢిల్లీ సర్ గంగారామ్ హాస్పిటల్‌లో దారుణం
25 మంది కొవిడ్ రోగులు మృతి
24 గంటలలో ఊపిర్లకు ఉరి
సరఫరా బాగుందని తేల్చిన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా రోగుల ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు కొరత తీవ్రతరంఅయి, రోగుల ప్రాణాలు గాలిలో దీపాలు అవుతున్నాయి. దేశ రాజధానిలోని ప్రఖ్యాత సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో గడిచిన 24 గంటలలో 25 మంది కరోనా రోగులు ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతోమృతి చెందారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులు శుక్రవారం తెలిపారు. ఆక్సిజన్ నిల్వలు అడుగంటడం, చికిత్స పొందుతున్న రోగులకు తగు విధంగా నిరంతర ఆక్సిజన్ సరఫరాలో సమస్యలు తలెత్తడం పలు విధాలుగా ఆరోగ్యపరమైన సంక్షోభానికి దారితీస్తోంది. ఆక్సిజన్ లేకపోవడంతో పాతిక మంది కన్నుమూశారని తెలిపిన ఆసుపత్రి వర్గాలు బెడ్స్‌పై ఉన్న మరో 60 మంది పరిస్థితి విషమిస్తోందని తెలిపాయి. దేశ రాజధానిలో ఇప్పుడు ఆక్సిజన్ సరఫరా సంక్షోభం నెలకొంది. ఆక్సిజన్ సరఫరా అనేది రోగులకు నిర్ణీత ఒత్తిడితో అందాల్సి ఉంటుంది. అయితే తక్కువ పీడనపు స్థాయిలో వాయువు అందితే రోగి తట్టుకునే పరిస్థితి ఉండదు. ఇది కొన్ని సందర్భాలలో వారిని ముందుగానే చావుకు దగ్గర చేస్తుందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ ఆసుపత్రిలో సరైన ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని, భయాందోళనల అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు శుక్రవారం ప్రకటన వెలువరించాయి. ఉన్న నిల్వలకు తోడుగా తాజాగా ట్యాంకరు కూడా పంపించినట్లు.
నిల్వ సామర్థం పూర్తిగా అందుబాటులోకి తెచ్చుకోవచ్చునని వివరించారు. అయితే ఇప్పుడు ట్యాంకర్ వచ్చిన విషయం వాస్తవమే అని అయితే ఇది కేవలం ఐదు గంటలు ప్రాణవాయువు సరఫరాకు ఉపయోగపడుతుందని, రోగుల చికిత్సకు నిరంతర ఆక్సిజన్ సరఫరా అందులోనూ తక్కువ ఒత్తిడి లేని ప్రాణవాయువు అవసరం అని, నిరాంతర ఆక్సిజన్ అవసరం అని ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డిఎస్ రాణా తెలిపారు. ఆసుపత్రిలో మొత్తం 500 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వీరంతా వెంటిలేటర్లపై ఉండాల్సిందే. వీరిలో 150 మందికి అత్యధిక మోతాదులో ఆక్సిజన్ ఊతం అవసరం . లేకపోతే ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అనేక వాస్తవిక సమస్యలు ఉన్నాయని, వెంటిలేటర్లు, బిఐపిఎపి మిషిన్లు సరిగా పనిచేయడం లేదని. 60 మంది రోగుల పరిస్థితి చావుబతుకుల మధ్యకు చేరిందని ఆసుపత్రికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.