మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచంలోనే భారత్‌ను శక్తి కేంద్రంగా మార్చేందుకు ఇన్నోవేషన్.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే 3 ‘ఐ’లతోనే సాధ్యమవుతుందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం బయో ఏషియా 2023 రెండో రోజు ఐదు ప్యానెల్ చర్చలు జరిగాయి. 50 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు, 175 మంది ఎగ్జిబిటర్లు, స్టార్టప్‌లు, ప్యానెల్ చర్చలు, బి2బి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కెటిఆర్ హాజరై మాట్లాడారు. ‘ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ ఈవెంట్‌లలో బయోఏషియా ఒక్కటన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణలకు వేదికగా నగరం నిలువడం సంతోషంగా ఉందన్నారు.- యువ భారత్ ప్రపంచ స్థాయి ఆవిష్కరణలపై ప్రభావం చూపుతుందన్నారు. మెడికల్ డివైజ్‌లు, ఫార్మాస్యూటికల్స్, అన్ని రకాల లైఫ్ సైన్సెస్ ఉత్పత్తుల తయారీ పరంగా, నైపుణ్య పరంగా భారత్ అవకాశాలను అందిస్తుందన్నారు.
ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే 3 ‘ఐ’ మంత్రాన్ని నేను గట్టిగా నమ్ముతున్నానని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.- 3‘ఐ’లు నాల్గొవ ఐ (ఇండియా) ప్రతిభావంతులు- ప్రపంచ దేశాల్లోనే భారత్‌ను శక్తి కేంద్రంగా తీర్చిదిద్దుతారని వెల్లడించారు. బయో ఫార్మా పరిశోధనలు, ఉత్పత్తులకు పెద్దపీట వేస్తున్నాం. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రస్తుత 80 బిలియన్ డాలర్ల నుంచి 250 బిలియన్ డాలర్లకు పెంచాలన్న తెలంగాణ రాష్ట్ర లక్షమని మంత్రి కెటిఆర్ తెలిపారు. సెల్, జీన్ థెరపీ రంగాల్లోనూ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 30 లక్షల చదరపు అడుగుల్లో వసతులు కల్పించాం. వచ్చే అయిదేళ్లలో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలను నెలకొల్పడంలో హైదరాబాద్ లోని లైఫ్ సైన్సెస్ కీలకం కానుందన్నారు.
సాంకేతికతను, జీవ ఔషధ ఉత్పాదక నైపుణ్యాలను సమ్మిళితం చేయడం ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చునని వెల్లడించారు. తెలంగాణను ప్రపంచ జీవ ఔషధ పరిశ్రమకు విజ్ఞాన రాజధానిగా చేయడమే మా ధ్యేయం’ మంత్రి స్పష్టం చేశారు. లిథువేనియా మంత్రి కరోలిస్ జెమైటిస్ మాట్లాడుతూ తెలంగాణలో ఉండటం ఇంట్లో ఉన్నట్లే అని వెల్లడించారు. ఈస్టోనియా రాయబారి కాట్రిన్ కివి మాట్లాడుతూ హైదరాబాద్‌కు రావడం భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని ఫార్మా రాజధానికి వచ్చినట్లు ఉందని వెల్లడించారు. ఒడిశా ఐటి శాఖ మంత్రి అశోక్ చంద్ర పాండా మాట్లాడుతూ మంత్రి కెటిఆర్ చొరవ, నిబద్ధతతో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం అభినందనీయమన్నారు.
* ఐదు స్టార్టప్‌లకు జ్యూరీ ప్రదానం…
బయో ఏషియా సదస్సులో 76 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొని ప్రదర్శించిన స్టార్టప్‌ల్లో అత్యంత వినూత్నమైన, భవిష్యత్ ఉత్పత్తులు, సేవలను అందించే ఐదు స్టార్టప్‌లకు జ్యూరీ అవార్డులు ప్రదానం చేశారు.
* -ఎక్సోబోట్ : వికలాంగులు, వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పనితీరును మెరుగుపరచడానికి బయోనిక్ లింబ్స్, ఎక్సోస్కెలిటన్‌లు, సహాయక పరికరాలను అభివృద్ధి చేస్తుంది.
* లాంబ్డాజెన్ : నాన్- వైరల్ జీనోమ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పైప్‌లైన్‌లతో వ్యక్తిగతీకరించిన బ్రెయిన్ ట్యూమర్ మైలోయిడ్ సెల్- ఆధారిత క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నది.
* ప్రతిభా హెల్త్‌కాన్ :- తెలంగాణకు చెందిన హెల్త్ & మెడ్‌టెక్ స్టార్టప్, పాపులేషన్ స్క్రీనింగ్‌ను నిర్వహించనున్నది.
* రంజా జెనోసెన్సర్ : రంజా అనేది కేవలం 90 నిమిషాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ని గుర్తించగల ప్రపంచంలోని మొట్టమొదటి పేపర్ ఆధారిత పరికరం.
* సత్యఆర్‌ఎక్స్: – క్యాన్సర్ ఔషధాలు, డిఎన్‌ఎ నిర్దిష్ట నైపుణ్యాన్ని అభివృద్ధి చేసింది.