55 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇదీ ఒకటి. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది.
లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇంతవరకూ ప్రభుత్వ పింఛను పొందని కుటుంబాల్లోని మహిళలనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛను వంటివేవీ పొందని కుటుంబంలోని మహిళలకే రూ. 2500 ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలోని మహిళలకు సిఎం త్వరలోనే తీపి కబురు తెలియజేస్తారని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ పథకం గురించే చెబుతారని ఊహాగానాలు జోరందుకున్నాయి.