న్యూఢిల్లీ : కాన్నాళ్లుగా రోజువారీ 3 లక్షలకు పైగా నమోదైన కేసులు తాజాగా 2,55,874 కి తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 16 శాతం మేర కొత్త కేసులు తగ్గాయి. అలాగే రోజువారీ పాజిటివిటీ రేటు 20 శాతం నుంచి 15.52 శాతానికి దిగజారింది. సోమవారం 614 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 4,90,462 కు చేరింది. మరణాల రేటు 1.23 శాతంగా ఉంది. క్రియాశీల కేసులు 2,236,842కు తగ్గగా, మొత్తం కేసుల్లో వీటి శాతం 5.62 శాతంగా ఉంది. గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు 12,493 వరకు తగ్గాయి. తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. సోమవారం 2,67,753 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3,70,71,898 వరకు పెరిగాయి. ప్రస్తుతం 22.3 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం 62 లక్షల మంది టీకా తీసుకున్నారు. మొత్తం 162 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 15 నుంచి 18 ఏళ్ల మధ్య టీనేజర్లకు తొలిడోసు, ముప్పు పొంచి ఉన్న వర్గాలకు ప్రికాషనరీ డోసు ఇస్తుండటం థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.