న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 3 వేలకు పైగానే వెలుగు చూసిన కొత్త కేసులు , తాజాగా 2500 కు దిగి రావడం కాస్త ఊరట కలిగించే విషయం. మరోవైపు కొత్త కేసుల కంటే , రికవరీలు ఎక్కువగా ఉండటం సానుకూల అంశం. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. సోమవారం 4.19 లక్షల మందికి పరీక్షలు చేయగా, 2,568 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందు రోజుకంటే 18.6 శాతం మేర కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 2911 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు 4.30 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా, అందులో 98.74 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 19,137 ( 0.04 శాతం) వరకు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 20 మంది మృతి చెందగా, మొత్తం 5.23 లక్షల మరణాలు సంభవించాయి. ఇక సోమవారం 16,23,795 మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 189 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.