న్యూఢిల్లీ : దేశంలోని వివిధ విద్యాశాఖల బోర్డులు అనుసరిస్తున్న విధానాల్లో వ్యత్యాసాల కారణంగా ఏడాదిలో దేశ వ్యాప్తంగా 35 లక్షల మంది 11 వ తరగతి లోకి అడుగు పెట్టలేక పోయారని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందులో 27.5 లక్షల మంది 10 వ తరగతిలో ఉత్తీర్ణత సాధించక పోగా, మరో 7.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని కేంద్ర విద్యాశాఖ అధ్యయనం వివరించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యాశాఖకు సంబంధించి మూడు సెంట్రల్ బోర్డులు ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సిఐఎస్‌సిఒ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఒఎస్) ఉండగా, ఇవికాకుండా అన్ని రాష్ట్రాల్లో వివిధ స్టేట్ బోర్డులు కలిపి మొత్తం 60 స్కూల్ బోర్డులు న్నాయి.
వివిధ రాష్ట్రాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతాల్లో తేడాలు బాగా కనిపించడంతో దేశ వ్యాప్తంగా బోర్డుల్లో పరిశీలన సాగించామని కేంద్ర పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ సంజయ్ కుమార్ వెల్లడించారు. దేశంలోని 60 బోర్డుల ప్రమాణాలను విద్యాశాఖ పరిశీలించింది. ఇందులో ఉత్తరప్రదేశ్, సిబిఎస్‌ఈ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్ లోనే 50 శాతం విద్యార్థులు నమోదై ఉండగా, మరో 50 శాతం మంది విద్యార్థులు మిగతా 55 బోర్డుల పరిధిలో ఉన్నట్టు విద్యాశాఖ వివరించింది. ఈ నేపథ్యంలో పది, పన్నెండు తరగతి ఫలితాల్లో తేడాలకు కారణాలను విశ్లేషించారు. సీనియర్ సెకండరీ ఎగ్జామ్స్‌లో , మేఘాలయలో ఉత్తీర్ణత 57 శాతం వరకు కనిపించింది.
కేరళలో 99.85 శాతం ఉంది. దేశ వ్యాప్తంగా 35 లక్షల మంది విద్యార్థులు 11 వ తరగతికి చేరలేక పోతున్నారు. ఇందులో 27.5 లక్షల మంది ఫెయిల్ అవుతున్నారు. 7.5 లక్షల మంది పరీక్షకు హాజరు కావడం లేదని తేలింది. దేశ వ్యాప్తంగా డ్రాప్‌ఔట్ అవుతున్నవారిలో 85 శాతం కేవలం 11 రాష్ట్రాల్లోనే ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, పశ్చిమబెంగాల్, హర్యాణా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనే విద్యార్థుల డ్రాప్‌ఔట్‌లు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రస్థాయి బోర్డల్లో ఫెయిలయ్యేశాతం ఎక్కువగా ఉండడానికి అక్కడి స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత, శిక్షణ పొందిన వారు లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయని అధ్యయనం వివరించింది. వివిధ స్టేట్ బోర్డుల ఫలితాల్లో వ్యత్యాసాలను పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో 10,12 వ తరగతుల ఫలితాలను కూడా అధ్యయనం చేశారు.
వివిధ బోర్డులు అనుసరిస్తున్న భిన్న నమూనాలే విద్యార్థుల ప్రతిభలో వ్యత్యాసాలకు కారణంగా తాజా అధ్యయనం పేర్కొంది. సెకండరీ, హైయ్యర్ సెకండరీ బోర్డులను కలిపి ఒకే బోర్డుగా మార్చడం విద్యార్ధులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. వివిధ బోర్డుల్లో సిలబస్ వేర్వేరుగా ఉండటం జాతీయ స్థాయి ఎంట్రెన్స్ టెస్టుల్లో విద్యార్థులకు ఆటంకంగా మారినట్టు గుర్తించింది. సైన్స్ సిలబస్‌ను సెంట్రల్ బోర్డులో కలపడం వల్ల జేఈఈ , నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులకు ప్రయోజన కరంగా ఉంటుందని స్టేట్ బోర్డులకు తాజా అధ్యయనం సిఫార్సు చేసింది. పదవ తరగతి స్థాయిలో డ్రాప్‌ఔట్‌లను కట్టడి చేయడం ఈ ప్రామానీకరణ ప్రయత్నానికి మరో కారణమని తెలిపింది.