Thursday, January 23, 2025

ఇక్కడ ఎవరు బుగ్గి ? ఎవరు సజీవం… నా కూతురు ఎక్కడ ? కన్నీటితో ఓ తల్లి ప్రశ్న

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మంటలు మిగిల్చిన విషాదంలో ఎందరు ఆహుతి?

27 Members dead in Delhi Mundka Fire

న్యూఢిల్లీ : స్థానికంగా మండ్కా ప్రాంతంలో కాలిన నాలుగు అంతస్తుల భవనం దారుణ విషాద సంకేతస్థలి అయింది. తమ ఆప్తులు , ఆత్మీయుల ఆచూకి కోసం బంధువులు స్నేహితులు శనివారం ఈ శిథిలాల్లో వెతుకుతున్నారు. శుక్రవారం చెలరేగిన మంటలలో మూడంతస్తుల్లోని వారి ప్రాణాలు బుగ్గి అయ్యాయి. 27 మంది వరకూ సజీవ దహనం అయినట్లు వెల్లడైంది. అయితే ఇప్పటికీ 29 మంది జాడ తెలియడం లేదని, గల్లంతు అయ్యారని పోలీసులు తెలిపారు. దీనితో పలువురు ఇక్కడికి వచ్చి తమ వారి ఆచూకీ ఆనవాళ్లకు వెతుక్కుంటున్నారు.

మొత్తం 27 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. అయితే ఇప్పటికైతే కేవలం ఏడుగురినే వారెవ్వరైంది అనేది గుర్తించారు. వొళ్లు ముఖాలు పూర్తిగా కాలిపోయి ఉండటంతో భౌతికకాయాల గుర్తింపు ప్రక్రియ క్లిష్టం అయింది. భవనంలో పలు చోట్ల కాలి పడి ఉన్న కొన్ని మానవ అవశేషాలను కనుగొన్నామని దీనితో మృతుల సంఖ్య 30కు చేరుకోవచ్చునని అగ్నిమాపక దళం సిబ్బంది తెలిపింది. బిల్డింగ్ మంటలు పూర్తిగా చల్లార్చే ప్రక్రియ శనివారం కూడా జరిగింది. ఈ క్రమంలో కాలి పడి ఉన్న వారు కన్పించినట్లు అనధికారికంగా వెల్లడైంది. ఈ బిల్డింగ్‌కు సరైన ఫైర్ సేఫ్టి సర్టిఫికెట్ లేదు. కేవలం ఒకే ప్రవేశ ద్వారం ఉంది. దీని ద్వారానే రాకపోకలు సాగుతున్నాయి.

కింది అంతస్తులోని సిసిటీవీ కెమెరాలు, రౌటర్ల కార్యాలయంలోని ఓ ఎసిలో జరిగిన పేలుడు తీవ్రత వల్లనే ఈ భారీ మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నట్లు ఢిల్లీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. ప్రమాద కారకులుగా పేర్కొంటూ ఇప్పటికే ఈ ఆఫీసు ఓనర్లు హరీష్ గోయల్ , సోదరుడు వరుణ్ గోయల్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీసు సమీర్ శర్మ తెలిపారు. ఘటనా స్థలానికి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం వచ్చారు. పరిస్థితిని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ పది లక్షల పరిహారం, గాయపడ్డ వారికి రూ 50 వేల చొప్పున సాయం ప్రకటించారు. మంటల వ్యాప్తికిదారితీసిన కార్యాలయం యాజమానుల తండ్రి కూడా మంటలలో చనిపోయినట్లు కనుగొన్నారు. ఈ భవనం యజమానికోసం గాలిస్తున్నారు.

నా కూతురు ఎక్కడ ? కన్నీటితో ఓ తల్లి ప్రశ్న

అగ్ని ప్రమాదం తరువాత తన కూతురు పూజ ఇంటికి రాలేదని, తాను పలు ఆసుపత్రులకు వెళ్లానని , అక్కడ ఎక్కడా ఆమె కన్పించలేదని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు ఇక్కడి సిసిటీవీ కెమెరాల తయారీ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఘటన తరువాత తాను అక్కడికి వెళ్లానని అయితే పూర్తిగా కాలిపోయి ఉన్న శవాలలో తన కూతురు లేదని, ఆమె పుట్టుమచ్చలు ఆనవాళ్లు గురించి తాను వెతికానని , దీనితో ఆసుపత్రులలో చికిత్స పొందే వారిలో కూతురు ఉండి ఉంటుందని ఆశించి పలు ఆసుపత్రులకు వెళ్లానని అయితే ఎక్కడా ఆమె జాడ లేదని తన కూతురు ఏమయిందని ఈ తల్లి ప్రశ్నించింది. ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తోంది. నలుగురు సభ్యుల కుటుంబానికి ఆమెనే జీవనాధారం అయితే ఆమె కన్పించడం లేదని ఇప్పుడు తాను ఏం చేయగలనని ప్రశ్నించింది. వినేవారు లేని దీనస్థితితో తల్లడిల్లిందీ తల్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News