ఎండు మిర్చి క్వింటాల్ రూ.27వేలు
ఎనుమాముల చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక ధర
మన తెలంగాణ/కార్పొరేషన్ : వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మార్కెట్ చరిత్రలోనే ఎన్నడులేనివిధంగా ఎండు మిర్చి (దేశిరకం)కి క్వింటాల్‌కు రూ.27,000 ధర పలికింది. పత్తి గరిష్ట ధర అత్యధికంగా క్వింటాల్‌కు రూ.9850 పలికింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌లో రెండవది ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. ఈ మార్కెట్‌లో కొంతకాలంగా వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులకు అత్యధిక ధరలు పలుకుతుంది. ప్రధానంగా పత్తి, మిర్చికి ఎన్నడులేనటువంటి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది పింజ పొడవు పత్తి క్వింటాల్ ధర రూ.6025 ఉంటే.. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.7వేల లోపు కంటే తగ్గలేదు. ఇటీవల పత్తికి గరిష్ట ధర క్వింటాళ్‌కు రూ.9850 వరకూ పలికింది. మార్కెట్ చరిత్రలోనే పత్తికి ఇదే రికార్డు ధర. గతంలో ఇంతటి ధర ఎప్పుడు లభించలేదు. పత్తితోపాటు మిర్చికి ఈ ఏడాది డిమాండు ఎక్కువగా ఉండడం తో ఎనుమాముల మార్కెట్‌కు తేజ, వండర్‌హాట్, దేశి, డిడి(దేవునూరు డీలక్స్), 1048, తాలు 334 రకం మిర్చి వస్తోంది.
ఇన్నిరకాల మిర్చి ఎనుమాముల మార్కెట్‌కు రావడం జరుగుతోంది. సోమవారం దేశీరకం మిర్చికి రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.27 వేల ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన రైతు వంగ అయియ్య 16 బస్తాల్లో దేశిరకం మిర్చిని ఎనుమాముల మార్కెట్‌కు తీసుకువచ్చాడు. ఈ రైతు వద్ద అడ్తిదారు సదాశివ ట్రేడర్స్ ద్వారా లక్ష్మిసాయి ట్రేడర్స్ ఈ మిర్చిని రూ.27 వేల ధర చొప్పున కొనుగోలు చేశారు. మిగిలిన రకాలైన ఎండు మిర్చి వండర్‌హాట్‌కు గరిష్టంగా రూ.22,500, కాగా యుఎస్-341 రకానికి గరిష్టంగా రూ.25 వేలు, డిడి రకానికి గరిష్ట ంగా రూ.23 వేలు, 1048 రకానికి రూ.19వేలు ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 1.60 లక్షల క్వింటాళ్లకుపైగా మిర్చి మార్కెట్‌కు వచ్చింది.