జూలై 15లోగా మరోసారి మంత్రుల బృందం నివేదికపై చర్చ
రాష్ట్రాలకు పరిహారం పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం లేదు
47 జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : క్యాసినో, ఆన్‌లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, లాటరీపై 28 శాతం జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) ప్రతిపాదనను జిఎస్‌టి కౌన్సిల్ వాయిదా వేసింది. చండీగఢ్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన రెండు రోజుల జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం బుధవారం ముగిసింది. ఈ సమావేశం అనంతరం ఆర్థికమంత్రి మీడియాకు వివరాలను వెల్లడించారు. క్యాసినో, ఆన్‌లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, లాటరీపై 28 శాతం జిఎస్‌టి ప్రతిపాదనను వాయిదా వేశామని ఆమె తెలిపారు. జూన్ తర్వాత కూడా రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహారం కొనసాగించాలని పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులు కోరినప్పటికీ, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
జూలై 15 లోపు హార్స్ రేసింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను రేటుపై మళ్లీ చర్చించాలని మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలోని మంత్రుల బృందం కోరింది. మళ్లీ ఆగస్టు మొదటి వారంలో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశమై, మంత్రుల బృందం నివేదికలపై చర్చించనుంది. మంత్రుల బృందం ఇచ్చిన నాలుగు నివేదికలపై ప్రధానంగా చర్చ జరిగిందని సీతారామన్ అన్నారు. 47వ జిఎస్‌టి సమావేశంలో ప్రధానంగా చర్చించిన 4 కీలక అంశాల్లో మొదటిది హేతుబద్ధీకరణ కమిటీ, రెండోది క్యాసినో, హార్స్ రేసింగ్, లాటరీ, ఆన్‌లైన్ గేమింగ్, మూడోది ఐటి, టెక్‌కు సంబంధించిన అంశాలు, నాలుగో అంశం విలువైన లోహాలు వంటివి ఉన్నాయి. జిఎస్‌టి కౌన్సిల్ ఆగస్టు మొదటి వారంలో మళ్లీ సమావేశం కానుందని ఆర్థికమంత్రి తెలిపారు.
రాష్ట్రాలకు పరిహారం
జిఎస్‌టి సమావేశంలో 16 రాష్ట్రాలకు చెందిన ఆర్థిక, ఇతర మంత్రులు పరిహారం పొడిగింపు అంశంపై డిమాండ్ చేశారు. ఈ 16 రాష్ట్రాల్లో 3 నుంచి 4 రాష్ట్రాలు మాత్రం పరిహార యంత్రాంగం నుంచి తొలగించి సొంతంగా రెవెన్యూకు అవకాశమివ్వాలని కోరాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయం తెలపలేదు. జిఎస్‌టిని 2017 జులై 1 నుంచి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఐదేళ్ల వరకు కొత్త పన్ను అమలుతో ఏమైనా రెవెన్యూ పరమైన నష్టం వస్తే కేంద్ర పరిహారం చెల్లిస్తుంది. అయితే 2022 జూన్ 30తో ఐదేళ్ల వ్యవధి ముగుస్తుంది. రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి కారణంగా నష్టం వచ్చిందని, పరిహారాన్ని పొడిగించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై చర్చించినప్పటికీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కొన్ని ఇతర నిర్ణయాలు
ప్రింటింగ్, డ్రాయింగ్ ఇంక్, ఎల్‌ఇడి ల్యాంప్‌లు, కత్తులు, బ్లేడ్‌లు, పవర్‌తో నడిచే పంపులు, డైరీ మెషినరీలపై జిఎస్‌టి పన్ను 12 శాతం నుంచి 18 శాతానికి పన్ను పెంపు
తృణధాన్యాల మిల్లింగ్ యంత్రాలపై పన్ను 5 శాతం నుంచి 18శాతానికి పెంపు
సోలార్ వాటర్ హీటర్, ఫినిషింగ్ లెదర్‌పై 5 శాతం నుంచి 12 శాతానికి పన్ను పెంపు
ప్రభుత్వం, స్థానిక అధికారులకు చేసే వర్క్ కాంట్రాక్ట్ సేవలపై పన్ను 18శాతానికి పెరిగింది
పెట్రోలియం కోసం వినియోగించే వస్తువులపై పన్ను 5% నుండి 12 శాతానికి పెంచారు
వివాదాలను నివారించడానికి రిటైల్ విక్రయం కోసం ‘బ్రాండెడ్’ అనే పదాన్ని ‘ప్రీ ప్యాక్డ్, లేబుల్’తో భర్తీ చేయడానికి జిఎస్‌టి కౌన్సిల్ ఆమోదించింది.
లూజ్ లేదా లేబుల్ లేకుండా విక్రయించే ఆహార పదార్థాలు, తృణధాన్యాలకు మినహాయింపు కొనసాగింపు
పోస్ట్ కార్డ్‌లు, ఎన్వలప్‌లు మినహా పోస్టుల శాఖ వారీగా 10 గ్రాముల కంటే తక్కువ ఉన్న సేవలపై మినహాయింపు ఉపసంహరణ
ఈవేస్ట్‌పై జిఎస్‌టి 5 శాతం నుంచి 18 శాతానికి పెంపు
ఆర్‌బిఐ, సెబీ, ఐఆర్‌డిఎఐ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ అందించే సేవలకు మినహాయింపు ఉపసంహరణ
రూ.1,000 లోపు హోటల్ వసతిపై 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది
చక్కెర, సహజ ఫైబర్ వంటి పన్ను విధించదగిన వస్తువుల నిల్వ, గిడ్డంగులపై జిఎస్‌టి మినహాయింపుపై ఉపసంహరణ
ఈశాన్య రాష్ట్రాలకు బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణానికి మినహాయింపు ఉపసంహరణ
జంతువులను వధించడం ద్వారా సేవలపై మినహాయింపును ఉపసంహరించుకున్నారు