కొత్తగా కొలువు తీరిన మోడీ మూడో కేబినెట్‌లో 28 మంది మంత్రులు నేరచరితులే. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు అయి ఉన్నాయని వెల్లడైంది. ఈ మంత్రులలో కొందరిపై అత్యంత తీవ్ర అభియోగాల కేసులు రికార్డు అయి ఉన్నాయి. కాగా వీరిలో ఇద్దరు హత్యాయత్నం కేసులు ఉన్నట్లు , ఐపిసి 307 సెక్షన్ కింద ఇవి నమోదు అయి ఉన్నట్లు స్వయంగా వీరే తెలియచేసుకున్నారు. ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన క్రమంలో ఎన్నికల హక్కుల సంస్థ అయిన ప్రజాస్వామిక సంస్కరణల సంస్థ (ఎడిఆర్) ఇప్పుడు ఈ వివరాలు రాబట్టి, వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల కేంద్ర కేబినెట్‌లోకి 72 మంది మంత్రులను తీసుకున్నారు. తీవ్రస్థాయి అభియోగాలు అంటే హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేష ప్రసంగాలకు దిగడం వంటివాటితో వీరికి సంబంధం ఉందని స్పష్టం అయింది. ఐపిసి 370 పరిధిలో హత్యాయత్నం కేసు నమోదు అయి ఉన్న ఇద్దరు కూడా మంత్రులు కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
ఈ మంత్రులిద్దరిలో ఒక్కరు శంతానూ ఠాకూర్ ఆయన పోర్టు, షిపింగ్, జల మార్గాల సహాయ మంత్రిగా చేరారు. కాగా సుకాంత మజుందార్ విద్యా, ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారని ఎడిఆర్ తెలిపింది. ఇక ఐదుగురు మంత్రులు మహిళలపై దాడులు ఇతరత్రా ఘటనలకు పాల్పడ్డ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ మంత్రుల పేర్లను కూడా వెల్లడించారు. హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్, ఠాకూర్, మంజుందార్, సురేష్ గోపీ, జువాల్ ఓరామ్ ఈ స్త్రీ దాడుల కేసుల్లో నిందితులు. ఎనమండుగురు మంత్రులపై విద్వేషకర ప్రసంగాల కేసులు ఉన్నాయి. మొత్తం మీద మంత్రిమండలిలో దాదాపు 39 శాతం వరకూ తమపై క్రిమినల్ కేసులున్నాయనే విషయాన్ని స్వయంగా ప్రకటించుకున్నారు. ఈ నెల 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రమాణం చేసింది. సమతూకతను పాటిస్తూ, నిర్ణీత లక్షాలతో దేశాన్ని మరింతగా ప్రగతి దిశకు తీసుకువెళ్లుతామని ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రకటించి ఉన్నారు.