Thursday, January 23, 2025

ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జిఎస్‌టి!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్‌పై గరిష్ఠంగా 28 శాతం జిఎస్‌టి విధించాలని ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. నైపుణ్యంతో కూడినా లేక చాన్స్‌మీద ఆధారపడిన గేమ్ అయినా సరే గరిష్ఠ జిఎస్‌టి విధించాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ ప్రతిపాదించనుందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అలాగే జిఎస్‌టి లెక్కింపు విధానంలోనూ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మంత్రుల బృందం నివేదిక దాదాపు ఖరారయిందని, త్వరలో జిఎస్‌టి కౌన్సిల్‌కు సమర్పించనున్నారని తెలుస్తోంది. ఆన్‌లైన్ గేమింగ్‌పై ప్రస్తుతం 18 శాతం జిఎస్‌టి విధిస్తున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌లో పాల్గొనే ఆటగాడు చెల్లించే ప్రవేశ రుసుం సహా పూర్తి విలువపై జిఎస్‌టి వర్తిస్తుంది. అయితే ఆన్‌లైన్ గేమింగ్‌పై జిఎస్‌టిని 28 శాతానికి పెంచాలని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని బృందం గతంలో సిఫార్సు చేయగా.. నివేదికను పునః పరిశీలించాలని జిఎస్‌టి కౌన్సిల్ మంత్రుల బృందానికి సూచించింది.

దీంతో అటార్నీ జనరల్‌తో పాటుగా ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమకు చెందిన భాగస్వామ్య పక్షాలనుంచి బృందంఅభిప్రాయాలు సేకరించింది. దీనికి అనుగుణంగా నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో ఆన్‌లైన్ గేమింగ్‌ను ‘ గేమ్స్ ఆఫ్ స్కిల్’, ‘గేమ్స్ ఆఫ్ చాన్స్’గా మంత్రుల బృందం వర్గీకరించింది. అయినప్పటికీ రెండింటిపైనా 28 శాతం జిఎస్‌టిని విధించాలని నివేదికలో పేర్కొన్నట్లు తెలుసోంతది. అయితే లెక్కింపు విషయంలో కొంతమేరకు ఊరట కల్పించినట్లు మాత్రం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో దేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌కు ఆదరణ విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.13,600 కోట్లుగా ఉన్న ఈ మార్కెట్ 2024 25 నాటికి రూ.29,000 కోట్లకు చేరుకుంటుందని ఓ నివేదిక అంచనా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News