Wednesday, January 22, 2025

దగాకోరు ‘ముసాయిదా’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నియమించిన రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసి) నివేదిక రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నివేదికను అమల్లోకి తేకుండా నిలిపివేయాలని బోర్డు చైర్మన్‌ను కోరింది. అంతే కాకుండా రిజర్వాయర్ మేనెజ్‌మెంట్ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహిరించిన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి రవికుమార్ పిళ్లై శనివారం నాటి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలపని పలు అంశాలను అంగీకరించినట్లు కమిటీ సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. ‘దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. కన్వీనర్‌ అంశాలను మీడియా ముందు ప్రకటించారు. దీన్ని నిరసిస్తున్నాం. కమిటీ కన్వీనర్‌ను వీటిపై వివరణ కోరాలని విజ్ఞప్తి చేస్తున్నాం.’ అని సోమవారం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి రజత్ కుమార్ కృష్ణా బోర్డు చైర్మన్‌కు ఘాటుగా లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జలవిద్యుత్ ఉత్పతిలో సమాన వాటాలకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదని తెలిపారు.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా జలవిద్యుత్ ఉత్పతి కోసమే నిర్మించిన ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 280 టిఎంసిల నీటిని విడుదల చేయాల్సి ఉందని గుర్తుచేశా రు. ఈ నీటిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రా్రష్ట్రాలు సాగర్ ద్వారా తాగు, సాగు నీటి అవసరాలు చెన్నై తాగునీటి అవసరాల మహారా ష్ట్ర, కర్ణాటక, ఎపి రాష్ట్రాలు తలా 5టిఎంసీల నీటిని తమ తమ వాటాల కే టాయించాయన్నారు. ఇందుకోసం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ప్రతియేటా జులై నుంచి అక్టోబర్ వరకూ 1500క్యూసెక్కులు మాత్రమే విడుదల చేయాలన్నారు. శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్‌ఆర్‌బిసి) పథకానికి 19 టిఎంసిల కేటాయింపు మాత్రమే ఉందన్నారు. కాని ఏపి ప్రభుత్వం అక్రమంగా పోతిరెడ్డిపాడు నుంచి 44000క్యూసెక్కుల నీటిని తరిలించేందుకు కాలువను విస్తరించిందని తెలిపారు. దీన్ని రెండవ ట్రిబ్యునల్‌లో కూడా సవాల్ చేశామని తెలిపారు.

పోతిరెడ్డి పాడు నుంచి ఏపికి 34టిఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాల్సివుందన్నారు. కాని అంతకంటే ఎక్కవగానే వాడుకుంటూ బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘిస్తున్నట్టు తెలిపారు. ఇదే అంశాన్ని తాము అనేక సార్లు బోర్డు దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు రూల్‌కర్వ్ నిర్ణయించేముందు కమిటి ఈ అంశాలేవి దృష్టిలో పెట్టుకోలేదని నివేదికను బట్టి స్పష్టమవుతోందని తెలిపారు. ప్రతి ఏటా మిగులు జలాల్లో కూడా అధికంగా వాడుకుంటోందని తెలిపారు. కృష్ణానదీజలాల్లో ఏపికి 66శాతం, తెలంగాణకు 34శాతం వాటాలకు తెలంగాణ అంగీకరించిందని కన్వీనర్ ప్రకటించడం సత్యదూరం అన్నారు. ఈ ఏడాది మే 6న జరిగిన కృష్ణాబోర్డు 16వ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీజాలాల్లో 50:50వాటాను డిమాండ్ చేసిన విషయం గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి అవసరాలు పెరిగాయని తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి, కల్వకుర్తి , నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద 1012లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు.

105టిఎంసీలు సరిపోవన్నారు.తెలంగాణ రాష్ట్రంలో తాగునీటికి , పారిశ్రామిక అవసరాలకు కలిపి మొత్తం 575టిఎంసీల నీరు అవసరం ఉందని తెలిపారు. కాని కృష్ణాబోర్డు ప్రతియేటా 66:34 నిష్పత్తిలో నీటి వాటా కొనసాగిస్తోందని , మే 27నాటి సమావేశం మినిట్స్‌లో కూడా అదే వుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని తెలిపారు. ఒక ఏడాదిలో ఆ రాష్ట్రం ఉపయోగించుకోలేని కోటా నీటిని క్యారిఓవర్ నిల్వనుంచి ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించాలని తాము చేసిన విజ్ణప్తిని కూడా పట్టించుకోలేదని తెలిపారు. శనివారం నాటి కృష్ణారిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటి సమావేశంలోని డ్రాఫ్ట్ రిపోర్టులో ఈ అంశాలేవి ప్రతిబింబించలేదని తెలిపారు. తాము అంగీకరించని అంశాలను కూడా అంగీకరించామని మీడియాకు వెల్లడించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రిజర్వాయర్ కమిటి ఇచ్చిన నివేదికను ఆమోదించకుండా నిలిపివేయాలని కోరుతూ ఈ మేరకు రజత్ కుమార్ కృష్ణాబోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్‌సింగ్‌కు లేఖ రాశారు. లేఖ ప్రతిని సిడబ్యుసికి , ఈఎన్సీకి పంపారు.

ఏకపక్షంగా ఆర్‌ఎంసి నివేదిక

కృష్ణా రిజర్వాయర్స్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం ఏకపక్షంగా ముగిసింది.సోమవారం జలసౌధలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారులెవరూ పాల్గొనలేదు. కమిటీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అప్పటికే రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటి రూపొందించిన నివేదికను అంగీకరిస్తూ ఏపి ప్రభుత్వం తరపున ఈఎన్సీ నారాయణ రెడ్డి సంతకం చేశారు. ఈ నివేదికనే తుదినివేదికగా నిర్ణయించిన కమిటి దీన్ని కృష్ణా నదీయాజమాన్యబోర్డు చైర్మన్‌కు సమర్పించనుంది.

కమిటి సమావేశం అనంతరం ఏపి ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తుదినివేదికపై సంతకం చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సభ్యులు కూడా హాజరైవుంటే కొన్ని అంశాలు కొలిక్కి వచ్చివుండేవన్నారు. శ్రీశైల ,నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ విధివిధానలపై స్పష్టత వచ్చేదన్నారు. అంతే కాకుండా శాశ్విత ప్రాతిపదికన రిజర్వాయర్స్ మేనేజ్‌మెంట్ కమిటి కూడా ఏర్పాటయ్యేదని తెలిపారు. అయితే ఆర్‌ఎంసి ఇక కొనసాగుతుందా లేదా అనేది తెలియాల్సివుందని ఈఎన్సీ పేర్కొన్నారు.కమిటి సమావేంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారులు పాల్గొనలేదని, అందుకు గల కారణాలు ఏమిటో వివరిస్తూ తెలంగాణ నీటిపారుల శాఖ స్పషల్ సీఎస్ రజత్‌కుమార్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News