ఒక్కరోజే 573 మరణాలు
22.02 లక్షలకు తగ్గిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 2,86,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,03,71,500కు చేరుకుంది. తాజాగా మరో 573 మరణాలు నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 22,02,472కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాలు తెలియచేస్తున్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 22,02,472కి తగ్గిపోగా మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్యలో ఇది కేవలం 5.46 శాతం మాత్రమే. కాగా..కొవిడ్ రికవరీ రేటు 93.33కి తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 20,546 తగ్గింది. రోజు వారీ పాజిటివ్ రేటు 19.59 శాతం ఉండగా వారం వారీగా పాజిటివ్ రేటు 17.75 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,76,77,328 మంది కొవిడ్ నుంచి కోలుకోగా మరణాల రేటు 1.22 శాతంగా నమోదైంది. దేశవ్యాప్త కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కింద ఇప్పటివరకు మొత్తం 163.84 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది.