Wednesday, January 22, 2025

బాలాసోర్ ప్రమాదం: 29 మృతదేహాల గుర్తింపు పూర్తి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనలో మరణించిన ప్రయాణికులలో 81 మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో భద్రపరచగా వీటిలో 29 మృతదేహాల గుర్తింపు పూర్తయినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్(బిఎంసి) శుక్రవారం వెల్లడించింది. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైనట్లు బిఎంసి మేయర్ సులోచనా దాస్ తెలిపారు.

భువనేశ్వర్ ఎయిమ్స్‌లో భద్రపరిచిన 81 మృతదేహాలలో 29 మృతదేహాలను డిఎన్‌ఎ విశ్లేషణ ఆధారంగా గుర్తించినట్లు దాస్ తెలిపారు. మృతదేహాల కోసం ఒకరి కన్నా ఎక్కువ మంది ముందుకు రావడంతో భారతీయ రైల్వే అధికారులు, ఎయిమ్స్ భువనేశ్ అధికారులు డిఎన్‌ఎ విశ్లేషణ ప్రక్రియ చేపట్టినట్లు మేయర్ తెలిపారు. మృతదేహాలు అన్నిటినీ వాటి స్వస్థలాలకు పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు దాస్ తెలిపారు. గుర్తించిన 29 మృతదేహాల బంధువులు ఇప్పటికే భువనేశ్వర్ చేరుకున్నట్లు ఆమె తెలిపారు. 29 మృతదేహాలలో ఒకరి కుటుంబం ఒడిశాకు చెందినది కాగా మిగిలిన వారంతా పశ్చిమ బెంగాల్, బీహార్‌కు చెందినవారని ఆమె వివరించారు.
ఢిల్లీలోని సెంట్రల్ లేబరేటరీ నుంచి డిఎన్‌ఎ రిపోర్టు రావడానికి దాదాపు 20 రోజులు పట్టిందని, 81 మృతదేహాల గుర్తింపు కోసం మొత్తం 88 డిఎన్‌ఎ శాంపిల్స్ పంపించడం జరిగిందని మేయర్ తెలిపారు.

బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 2వ తేదీ సాయంత్రం రైలు ప్రమాద ఘటన జరిగింది. చెన్నకు వెళ్లే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొనడంతో పట్టాలు తప్పగా పట్టాలు తప్పిన బోగీలను ఢీకొన్న బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పింది. ఈ మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనలో మొత్తం 293 మంది ప్రాణాలు కోల్పోయారు. 81 మృతదేహాలు మినహా మిగిలిన మృతదేహాలను వారి బంధువులకు అప్పగించడం ఇదివరకే పూర్తికాగాగుర్తింపునకు నోచుకోని 81 మృతదేహాలను మాత్రం పరదీప్ పోర్టు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కంటెయినర్లలో మైనస్ 17 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News