Wednesday, January 22, 2025

నేడు రెండో వన్డే.. సిరీస్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డేలో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా శనివారం న్యూజిలాండ్‌తో జరిగే రెండో మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. మరోవైపు ఉప్పల్ వన్డేలో పోరాడి ఓడిన న్యూజిలాండ్ ఈసారి విజయంపై కన్నేసింది. కిందటి మ్యాచ్‌లో ఓడిపోయే స్థితి నుంచి మ్యాచ్‌ను గెలిచే వరకు కివీస్ వెళ్లింది. అసాధారణ బ్యాటింగ్‌తో కివీస్ దాదాపు గెలిపించినంత పనిచేసిన సెంచరీ హీరో బ్రాస్‌వెల్‌పై న్యూజిలాండ్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక తొలి వన్డేలో చారిత్రక డబుల్ సెంచరీతో అలరించిన టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టుకు కీలకంగా మారాడు.

అతని ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి, యువ సంచలనం ఇషాన్ కిషన్, స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక సిరాజ్, కుల్దీప్, షమి, శార్దూల్‌తో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే సంచలనాలకు మరో పేరుగా చెప్పుకునే కివీస్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా కనిపిస్తోంది. దీంతో రాయ్‌పూర్‌లో జరిగే వన్డే కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఓపెనర్లే కీలకం..

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు కీలకంగా మారారు. ఉప్పల్‌లో వీరిద్దరూ మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఈసారి కూడా వీరి నుంచి జట్టు శుభారంభాన్ని ఆశిస్తోంది. శుభ్‌మన్ గిల్ జోరుమీదుండడం టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. హైదరాబాద్‌లో శుభ్‌మన్ కళ్లు చెదిరే డబుల్ సెంచరీ సాధించిన విషయం మరచిపోకూడదు. ఈసారి కూడా అతను జట్టుకు ప్రధాన అస్త్రంగా మారాడు. కెప్టెన్ రోహిత్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. మరోవైపు తొలి వన్డేలో విఫలమైన డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఈసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల కాలంలో కోహ్లి వరుస సెంచరీలతో చెలరేగి పోతున్న విషయం తెలిసిందే. రెండో వన్డేలో చెలరేగేందుకు కోహ్లి తహతహలాడుతున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. అతను కూడా రాణిస్తే టీమిండియాకు ఎదురే ఉండదు.

సూర్యకుమార్ ఈసారైనా?

మరోవైపు టి20 మ్యాచుల్లో ఆకాశమే హద్దు గా చెలరేగిపోతున్న సూర్యకుమార్ వన్డేల్లో మాత్రం ఆ జోరును కొనసాగించలేక పోతున్నాడు. తొలి వన్డేలో ఆశించిన స్థాయిలో రాణి ంచలేక పోయాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమా రు చేసే సత్తా ఉన్న సూర్యకుమార్ చెలరేగితే ఈ మ్యాచ్‌లో భారత్‌కు భారీ స్కోరు ఖాయం.

ప్రతీకారం కోసం..

కాగా, తొలి వన్డేలో పోరాడి ఓడిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఉప్పల్‌లో టాప్ ఆర్డర్ విఫలం కావడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. కానీ రాయ్‌పూర్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలని భావిస్తోంది. కాన్వే, ఫిన్ అలెన్, నికోల్స్, డారిల్ మిఛెల్, కెప్టెన్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్‌లతో కివీస్ బ్యాటింగ్ బలంగా ఉంది. అయితే మొదటి వన్డేలో వీరంత తక్కువ స్కోరుకే ఔట్ కావడం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇదిలావుంటే ఉప్పల్‌లో చారిత్రక సెంచరీ సాధించిన మైఖేల్ బ్రాస్‌వెల్ ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. బ్రాస్‌వెల్ మరోసారి విజృంభిస్తే భారత బౌలర్లుకు కష్టాలు ఖాయం. మిఛెల్ సాంట్నర్ రూపంలో కివీస్‌కు మరో పదునైన అస్త్రం ఉండనే ఉంది. ఇలాంటి స్థితిలో కివీస్‌ను తక్కువ అంచనా వేస్తే టీమిండియా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News