హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నూతన సచివాలయంలో గురువారం సుమారు మూడు గంటలకు పైగా తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.
మంత్రి వర్గం సమావేశం అనంతరం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వనపర్తి జర్నలిస్టు అసోసియేషన్‌కు 10 గుంటల స్థలం కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాలు స్థలం కేటాయింపు చేసినట్లు తెలిపారు. మైనార్టీ కమిషన్‌లో జైన్ కమ్యూనిటీ కలుపుతూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కమిషన్ సభ్యులుగా జైన్ కమ్యూనిటీకి చెందిన వారికి ఒకరికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.