Thursday, December 19, 2024

అమెరికాలో మన విద్యార్థులే ఎక్కువ

- Advertisement -
- Advertisement -

3.3 లక్షల మందితో టాప్
చైనాను వెనక్కి నెట్టి కొత్త రికార్డు
విదేశీ ప్రతిభకు యుఎస్ గాలం
వర్శిటీల్లో సానుకూలత కీలకం
నివేదికను వెల్లడించిన యుఎస్ ఎంబసీ
విద్యా అవకాశాలకు స్వాగతమని సంకేతాలు

న్యూఢిల్లీ : ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరు పలు ఉన్నతస్థాయి విద్యలు అభ్యసిస్తున్నారు. ఈ విధంగా అమెరికాకు అత్యధిక సంఖ్యలో విదేశీ విద్యార్థులను పంపిస్తోన్న రికార్డు భారతదేశానిదే అయింది. 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు అత్యధిక సంఖ్యలో బారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. ఈ విషయం సోమవారం వెల్లడైన ఓపెన్ డోర్స్ రిపోర్టు 2024తో స్పష్టం అయింది. అంతకు ముందు ఏడాది అంటే 202223లో అమెరికాలో చైనా విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉంది. తరువాతి స్థానంలో ఇండియా నిలిచింది. ఇప్పుడు చైనా రెండో స్థానంలోకి వెళ్లిందని నివేదికతో స్పష్టం అయింది. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థులలో భారతీయ విద్యార్థులు 29 శాతం వరకూ ఉన్నారని పేర్కొన్న ఈ నివేదిక వివరాలను యుఎస్ ఎంబసీ వెల్లడించింది. అమెరికాలో విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఆరంభమై మే వరకూ ఉంటుంది.

ఇటీవలికాలంలో అమెరికాకు పెద్ద ఎత్తున భారతీయ విద్యార్థులు వెళ్లుతున్న పరిణామం కీలకం అయింది. అంతకు ముందు ట్రంప్ తరువాతి బైడెన్ హయాంలో కూడా భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు. తాజా నివేదిక ప్రకారం ఇప్పుడు అమెరికాలో ఉన్న మన స్టూడెంట్స్ సంఖ్య అత్యధికంగా 3,31,602కు చేరింది. అంతకు ముందటి 2,68, 923తొ పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ. ఇక అమెరికాలోని ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య లో ఇప్పుడు చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398గా ఉంది. తరువాత దక్షిణ కొరియా 43,149, కెనడా 28,998, తైవాన్ 23,157గా ఉంది. 2008 /2009 నుంచి చూస్తే ఇప్పుడు మన విద్యార్థులదే పై చేయి అయింది. ఇప్పుడు తమ దేశంలో భారతీయ విద్యార్థుల సంఖ్య ఆల్‌టైం రికార్డు అని అమెరికా ఎంబసీ తెలిపింది.

పిహెచ్‌డి చదువులో ఎక్కువ వాటా

ఇక అమెరికాకు భారతదేశం నుంచే ఎక్కువ మంది మాస్టర్స్ , పిహెచ్‌డి స్థాయి చదువులకు వెళ్లుతున్నారు. ఇండియన్ గ్రాడ్యుయెట్ సంఖ్య ఇప్పుడు 19 శాతం పెరిగింది. మొత్తం మీద 1,96,567కు ఎగబాకింది. అండర్‌గ్రాడ్యుయెట్ కోర్సులకు విద్యార్థుల సంఖ్య 13 శాతం పెరిగింది. దాదాపు 40 మంది వరకూ ఈ కోర్సులలో ఉన్నారు. అయితే నాన్ డిగ్రీ స్టూడెంట్స్ సంఖ్య ఇప్పుడు 28 శాతం తగ్గింది. ఈ కేటగిరిలో 1426 మంది వరకూ ఉన్నారు. అంతర్జాతీయ స్థాయి చదువులు , ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల చదువుకు సంబంధించి ఆరంభమైన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీక్ (ఐఇడబ్లు) ప్రారంభం నేపథ్యంలో ఈ ఓపెన్ డోర్స్ రిపోర్టు వెలువడింది.

అంతర్జాతీయ విద్యా సంస్థ (ఐఐఇ) ఈ కీలక నివేదికను ప్రచురించింది. అమెరికాలో విద్యార్థుల స్థితిగతులు, ఏ దేశం నుంచి ఎక్కువగా విద్యార్థులు అక్కడికి వెళ్లుతున్నారు.? అనేది 1919 నుంచి ఈ సంస్థ తమ వార్షిక గణాంకాల నివేదికతో వెలువరిస్తోంది. 1972 నుంచి ఈ సంస్థకు ఈ విషయంలో అమెరికాకు చెందిన విద్యా సాంస్కృతిక వ్యవహారాలఅధికారిక విభాగం సహకరిస్తోంది. ఓపెన్ డోర్స్ పేరిట వెలువడే ఈ నివేదిక క్రమంలో అమెరికాలో విద్యకు ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సదవకాశాలు ఇతర పరిస్థితుల విశ్లేషణ జరుగుతోంది.

పైగా తమ రాయబార కార్యాలయం ద్వారా ఈ పరిస్థితిని అమెరికా ఎప్పటికప్పుడు ప్రచారం చేసుకుంటూ తమ దేశానికి ఎక్కువగా విదేశీ విద్యార్థులను రాబట్టుకొంటోంది. ఇందులో ప్రత్యేకించి చైనా, ఇండియా విద్యార్థులకు పెద్ద సీటు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో బ్రిటన్‌లో ఆర్థిక పరిస్థితి , అక్కడి వర్శిటీలకు గ్రాంట్లు తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో వలస వ్యతిరేక వాద ఘర్షణలు, ఇక కెనడాలో భారత వ్యతిరేక వంటివాటి పరిణామాలతో భారతీయ విద్యార్థులు ఎక్కువగా అమెరికా వర్శిటీల ద్వారాలు దాటుకుని వెళ్లుతున్నారని, ఈ క్రమంలో ఇప్పుడు చైనాతో పోలిస్తే ఎక్కువ మంది భారతీయ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారనే విషయం ట్రంప్ తిరిగొస్తున్న దశలో మరింత స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News