Thursday, January 23, 2025

రాయదుర్గం కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. విలాసవంతమైన జీవితం కోసం చెల్లెలి స్కెచ్..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి బాధితుడిని వారి చెర నుంచి విడిపించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మాదాపూర్ ఇన్‌ఛార్జ్ డిసిపి శ్రీనివాస రావు తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, అత్తాపూర్‌కు చెందిన గుంజపోగు సురేష్ అలియాస్ సూర్య అలియాస్ సూరి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎపిలోని కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం, పెద్దపులిపాక గ్రామానికి చెందిన బల్లిపుర వెంకట కృష్ణ చెఫ్‌గా పనిచేస్తున్నాడు. ఎపిలోని గుంటూరు జిల్లా, మాచర్లకు చెందిన గుర్రం నిఖితా, బాధితుడికి వరుసకు చెల్లి అవుతుంది. హైదరాబాద్, మెహిదీపట్నం, అంబేద్కర్‌కాలనీకి చెందిన రామగళ్ల రాజు అలియాస్ లడ్డు, శిండే రోహిత్, చందు, వెంకట్ కలిసి కిడ్నాప్ చేశారు. ఇందులో చందు, వెంకట్ పరారీలో ఉన్నారు. సురేష్ మైనర్‌గా ఉన్న సమయంలోనే నేరాలు చేయడం ప్రారంభించాడు. దొంగతనాలు, దోపిడీలు చేయడంతో ఎపి, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇతడి అన్న గుంజపోగు సుధాకర్ పేరుమోసిన నేరస్థుడు. సురేష్ వ్యసనాలకు బానిసగా మారాడు,అలాగే చిన్నప్పటి నుంచి లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడ్డాడు. వాటి కోసం డుబ్బలు కావాల్సి రావడంతో నేరాలుచేయడం ప్రారంభించాడు. కిడ్నాప్‌లు చేసి డబ్బులు వసూలు చేసేవారు, ఇలా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలోనే రాజు, రోహిత్, వెంకట్, చందుతో కలిసి ముఠాను తయారు చేశాడు. వీరు తెలిసిన తెలియని చాలామందిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేశారు. గుర్రం సురేందర్ హార్డ్‌వేర్ వ్యాపారం చేస్తున్నాడు. గుర్రం నిఖిత, బొల్లిపార వెంకటకృష్ణ ఇద్దరు కలిసి గచ్చిబౌలిలోని ఫ్యాబ్రికాన్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటికు వెంకటకృష్ణపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో పిటీ, ఎన్‌డిపిఎస్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టు కావడంతో జైలులో సురేష్‌తో వెంకటకృష్ణకు పరిచయం ఏర్పడింది. ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో కిడ్నాపులు చేసి డబ్బులు వసూలు చేశామని వెంకటకృష్ణకు సురేష్ చెప్పాడు. ఇలాంటి పని ఉంటే తమకు చెప్పాలని సురేష్ చెప్పాడు.

అక్టోబర్, 2023లో వెంకటకృష్ణ, సురేష్‌ను కలిసి తమ కంపెనీ ఎండి శివశంకర్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని చెప్పాడు. వెంటనే శివశంకర్‌ను కిడ్నాప్ చేసి రూ.2లక్షలు వసూలు చేశారు. వచ్చిన డబ్బులను అందరు కలిసి పంచుకున్నారు. తర్వాత డిసెంబర్, 2023లో సురేష్, వెంకటకృష్ణ, గుర్రం నిఖితను కలిశాడు. తమ వద్ద డబ్బులు లేవని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పాడు. తాము కూడా వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. డబ్బులు ఉన్న వారిని కిడ్నాప్ చేసి జీవితంలో సెటిల్‌కావాలని భావించారు. ఈ క్రమంలోనే తన కజిన్ బ్రదర్ సురేష్ హార్డ్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడని, ఇటీవలే కొత్త ఇంటిని కొనుగోలు చేశాడని నిఖిత చెప్పింది. అతడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని చెప్పింది. వివరాలు తీసుకున్న సురేష్ రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో అతడిని కిడ్నాప్‌కు అనుకూలమైన ప్రాంతానికి తీసుకుని రావాలని సురేష్, నిఖిత, వెంకటకృష్ణకు చెప్పాడు.

దీంతో ఈ నెల 4వ తేదీన నిఖిత, గుర్రం సురేష్‌కు ఫోన్ చేసి తాన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం చర్చించాలని చెప్పి సాయంత్రం సమయంలో ఖజాగూడ లేక్ రోడ్డు వద్దకు రావాలని చెప్పింది. కిడ్నాప్ విషయం తెలియని సురేందర్ అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న సురేష్ ముఠా సురేందర్ వచ్చి నిఖితతో మాట్లాడుతుండగానే కిడ్నాప్ చేసి కారులో తీసుకుని పారిపోయారు. వెంటనే నిఖిత తనకు ఏమి తెలియనట్లు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తన సోదరుడు కిడ్నాప్ పయ్యాడని ఫిర్యాదు చేసింది. తర్వాత సురేష్ బాధితుడి భార్యకు ఫోన్ చేసి రూ.2కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వెళ్తున్న దారిలోని బాధితుల నుంచి రూ.20లక్షలు తీసుకున్నారు. నిందితుల కారు కడ్తాల్‌కు వెళ్లగానే ఆగిపోయింది. వెంటనే ప్రధాన నిందితుడు సురేష్ తమ కారు మరమ్మత్తుకు వచ్చిందని వెంటనే వేరు కారు ఏర్పాటు చేయాలని వెంకటకృష్ణ, నిఖితకు ఫోన్ చేసి చెప్పాడు. వారు ఇద్దరు బాధితుడి ఇంటికి వెళ్లి వారి కారును తీసుకుని వెళ్లి నిందితులకు అప్పగించారు.

పోలీసులు కిడ్నాపర్లను వెంబడిస్తుండడంతో నిందితులు గమనించి శ్రీశైలం అడవుల్లోకి పారిపోయేందుకు వెళ్తుండగా ఆత్మకూర్ ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద బారికేడ్స్‌ను ఢీకొట్టారు. అక్కడే బాధితుడు సురేందర్‌ను విడిచిపెట్టి పారిపోయారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ మహేష్, డిఐ చంద్రశేఖర్, ఎస్సైలు శ్రీనివాస్, మన్మథ్, విజయ్, హెచ్‌సిలు పండరయ్య, ఆనంద్‌కుమార్, పిసిలు ప్రకాష్, దస్తగిరి, గోపీనాథ్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News