మన తెలంగాణ/కొల్లాపూర్ టౌన్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎక్సైజ్ శాఖ పరిధిలోని కోడేరు మండలం నార్య నాయక్ తండా, నాగులపల్లి తండాలలో గురువారం నాగర్‌కర్నూల్ డిపిఈఓ, డిటిఎఫ్‌లతో పాటు కొల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించినట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు తెలిపారు. ఈ దాడులలో 12 లీటర్ల నాటు సారా, 60 కిలోల నల్లబెల్లం, 7 కిలోల నవసాగరం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం మైలారం గ్రామ రహదారిలో అక్రమంగా నల్లబెల్లాన్ని, నగ సాగరాన్ని తరలిస్తున్న డిసిఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ వాహనంలో 12వేల 60 కిలోల నాటు సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, 507 కిలోల నవ సాగరం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నల్లబెల్లాన్ని తరలిస్తున్న డిసిఎం ఏపి 02 టిసి 3841 నెంబర్ గల వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ వివరించారు. నల్లబెల్లాన్ని, నవ సాగరాన్ని సరఫరా చేస్తున్న బిజె సప్లయర్ అబ్బరాజు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.