Wednesday, January 22, 2025

ఆయుధాలతో సిఎం కెసిఆర్ సభకు.. ముగ్గురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్ సహా ప్రముఖులు పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ఆయుధాలతో వచ్చిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన సభలో వివిఐపిలు ఉన్న సమయంలో ఓ వ్యక్తి రైఫిల్‌తో వచ్చేందుకు ప్రయత్నించాడు.

అయితే, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద పోలీసులు తనిఖీ చేసి అతడ్ని లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన దాన్ని యజమాని కారులో ఉంచి సభలోకి వెళ్లారు. కొద్దిసేపటికే శివ అనే వ్యక్తి కారులోని రైఫిల్‌తో బయటకు రావడంతో అక్కడున్న పోలీసులు ప్రశ్నించారు. తాను ఖైరతాబాద్ కు చెందిన దొండ్ల మధుయాధవ్ డ్రైవర్‌నని, ఆయుధం గన్‌మెన్‌దని చెప్పాడు. దీంతో అప్పటికే సభలోకి వెళ్లినవారిని వెనక్కి పిలిపించి సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: అక్రమ కేసులతో పోలీసుల వేధింపులు: ఈటల

కాగా, తన భద్రతకు గన్‌మెన్ కావాలని మధుయాదవ్ ఢిల్లీలోని సామ్రాట్ సెక్యూరిటీస్ ను సంప్రదించాడు. దీంతో వారు అతడికి పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ జవాన్ గురుసాహెబ్ సింగ్‌ను కేటాయించారని పోలీసుల విచారణలో తేలింది. గురుసాహెబ్ సింగ్ దగ్గర ఉన్న రైఫిల్, పిస్తోల్‌లకు జమ్మూకాశ్మీర్‌లో లైసెన్స్ పొందినట్లు సంబంధిత పత్రాలు చూపారు. నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రత కోసం తీసుకున్న ఆయుధాలను గన్‌మెన్‌గా వినియోగించేందుకు అనుమతి లేదు.

ఇతరుల వల్ల ప్రాణహాని ఉన్నవారు అంగరక్షకుడిని పెట్టుకోవాలంటే ముందుగా పోలీసు కమిషనర్ అనుమతి తీసుకోవాలి. సదరు వ్యక్తి ఈ నిబంధనలు అతిక్రమించడంతోపాటు ఆయుధాలతో ముఖ్యమంత్రి, వివిఐపిలు ఉన్న వేదిక వద్ద సంచరించడాన్ని పోలీసులు సీరియస్‌గా పరిగణించారు. ఈ క్రమంలోనే మధుయాదవ్ కారు డ్రైవర్, తాడేపల్లిగూడెం శివప్రకాశ్, గన్‌మెన్ గురుసాహెబ్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. గన్‌మెన్ నుంచి పాయింట్ 32 పిస్తోలు, 44 తూటాలు, పాయింట్ 315 బోర్ రైఫిల్, 50 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

Also Read: హైదరాబాద్ నాలుగు వైపులా నాలుగు ఆస్పత్రుల నిర్మాణం…

ఎవరీ మధుయాదవ్?
దొండ్ల మధుయాదవ్ ఖైరతాబాద్‌కు చెందిన పాలవ్యాపారి. తన తమ్ముడు చంద్రకాంత్ యాదవ్ పెళ్లి సందర్భంగా ఉగాది రోజున ప్రత్యేక హెలికాప్టర్‌లో పుణె వెళ్లి అక్కడి 150 ఏళ్ల చరిత్ర కలిగిన దగ్గుసేత్ గణపతి ఆలయంపై పూలవర్షం కురిపించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యి వార్తల్లో నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News