చేపల వేటకు వెళ్లి ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లా సొలీపూర్‌లో విషాదం
మన తెలంగాణ/షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని సొలీపూర్ గ్రామ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సొలీపూర్ గ్రామానికి చెందిన ఫరీద్(13), ఫారిన్(7), అక్షిత్ గౌడ్(7) అనే ముగ్గురు చిన్నారులు సమీపంలో ఉన్న ఓ వెంచర్‌లోని నీటి గుంత వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లారు. వీరిలో ఫరీద్, ఫారిన్ నీటిలోకి జారుకోవడంతో అక్షిత్ గౌడ్ వారిని రక్షించే ప్రయత్నం చేస్తూ తానూ మునిగిపోయాడు. నీటి గుంతపై ఉన్న మరో చిన్నారి గ్రామానికి పరుగులు తీసి విషయం గ్రామస్తులకు వివరించాడు. వెంటనే పెద్దసంఖ్యలో గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకోగా, అప్పటికే ముగ్గురు మృత్యువాత పడ్డారు. నీటి గుంత నుంచి చిన్నారుల మృతదేహాలను బయటకు తీయగానే మృతుల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించా రు. ఈ విషయం తెలుసుకున్న షా ద్‌నగర్ ఏసిపి కుషాల్కర్, ఫరూఖ్‌నగర్ తహశీల్దార్ గోపాల్, మున్నిపల్ చైర్మెన్ కొందూటి నరేందర్, కౌన్సిలర్ లతశ్రీ శ్రీశైలం గౌడ్‌తోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు చిన్నారుల మృతికి కారణమైన వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతోపాటు పది లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏసిపి కుషాల్కర్ మాట్లాడుతూ ముగ్గురు చిన్నారులు సరదాగా నీటి గుంతలో చేపలు పట్టేందుకు వెళ్ళి మృతి చెందారని వివరించారు. గ్రామ సమీపంలో ఉన్న వెంచర్‌లో అక్రమంగా మట్టిని తీయడం వల్లనే వర్షపునీరు చేరి చిన్నారుల మృతికి కారణమైందని తెలిపారు. మృతదేహాలను షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు, ప్రభుత్వానికి నివేదిక పంపించి మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేయనున్నట్లు వివరించారు.
3 children died after drowned in pit in shadnagar