Thursday, November 21, 2024

తొలి దశలో 3 కోట్ల మందికి ఉచిత టీకా

- Advertisement -
- Advertisement -

తొలి దశలో 3 కోట్ల మందికి ఉచిత టీకా
ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్
వ్యాక్సిన్‌పై వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి

3 Cr frontline workers to get free vaccine in 1st phase

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలి విడతలో 3 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఢిల్లీలోకి జిటిబి ఆస్పత్రిలో వ్యాక్సిన్ డ్రైరన్ జరుగుతున్న తీరును పరిశీలించిన అనంతరం మంత్రి ఈ ప్రకటన చేశారు.‘తొలి విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కోటి మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి, మరో రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఉచితంగా టీకా అందజేస్తాం. ప్రాధాన్య క్రమంలో ఉన్న మిగతా 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను ఎలా అందించాలనే దానిపై ఒక నిర్ణయానికి రానున్నాం’ అని ట్విట్టర్ వేదికగా మంత్రి వెల్లడించారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ(డిజిసిఎ) నిపుణుల బృందం పచ్చజెండా ఊపిన తరుణంలో మంత్రి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా శనివారం టీకా డ్రై రన్ కొనసాగుతున్న సందర్భంగా వ్యాక్సిన్‌పై అనేక వదంతులు వస్తున్నాయని, ఈ వదంతులను నమ్మవద్దని హర్షవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీకా సామర్థం, భద్రత, రోగ నిరోధకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. పోలియో టీకా ఇస్తున్న సమయంలోను ఇలాంటి వదంతులే పుట్టుకొచ్చాయని ఆయన గుర్తు చేశారు. కానీ వాటిని పక్కన పెట్టడం వల్లనే భారత్ ఇప్పుడు పోలియో రహిత దేశంగా మారిందన్నారు.
కాగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ మాక్‌డ్రిల్ శనివారం మొదలైంది. టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్‌లో అధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. నిజమైన వ్యాక్సిన్ ఇవ్వడం తప్ప వాస్తవ వ్యాక్సినేషన్‌లో పాటించే మిగతా మొత్తం ప్రక్రియను ఈ సందర్భంగా పాటిస్తారు. డిసెంబర్ 28, 29 తేదీల్లో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన తొలివిడత డ్రై రన్‌లో తలెత్తిన లోటుపాట్లను సవరించి కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ డ్రై రన్‌ను నిర్వహిస్తున్నారు. కాగా దేశంలో కరోనా టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ శుక్రవారం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఈ టీకాకు షరతులతో కూడిన అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డిజిసిఎ)కు సిఫార్సు చేసింది.

3 Cr frontline workers to get free vaccine in 1st phase

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News