Saturday, November 23, 2024

11 రోజుల్లో 3 కోట్ల ఉచిత టికెట్‌లు..

- Advertisement -
- Advertisement -

11 రోజులు…3 కోట్ల ఉచిత టికెట్‌లు …
‘మహాలక్ష్మి పథకం’తో పెరిగిన ఆక్యుపెన్సీ
ప్రతి రోజూ 51 లక్షల మంది ప్రయాణం
ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలు
ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకం’ కింద 11 రోజుల్లో ఆర్టీసి బస్సుల్లో సుమారుగా 3 కోట్ల ఉచిత టికెట్‌లు ఇచ్చినట్టు ఆర్టీసి ఎండి సజ్జనార్ తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి రాగా ప్రతిరోజు సగటున 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించారని ఆయన తెలిపారు. పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మంది ప్రయాణించగా, ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ పథకం వల్ల ఆర్టీసి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగిందన్నారు. గతంలో 69 శాతం ఆక్యుపెన్సీ ఉండగా ఇప్పుడు అది 88 శాతానికి పెరిగింది. మూడు రోజులు 17, 18, 19 తేదీల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్, -ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఆక్యుపెన్సీ సాధించాయని ఆయన తెలిపారు.

ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పనిసరి
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని ఆయన వెల్లడించారు. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటోలు ఉన్నాయి. వాటిని అప్‌డేట్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని ఎండి విసి సజ్జనార్ స్పష్టం చేశారు.

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చిందని, ముఖ్యంగా చివరి ట్రిప్పు బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణంతో పాటు వెనుక లాడర్ పైన ఎక్కి ప్రయాణిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రాణాలను ఫణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సరికాదని, రద్దీ సమయాల్లో తమ సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు. జీరో టికెట్ల విషయంలో కొందరు మహిళలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలని ఆయన కోరారు. జీరో టికెట్ ను జారీ చేస్తేనే ఆ చార్జీని టిఎస్ ఆర్టీసికి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

త్వరలో 2,050 కొత్త బస్సులు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందన్నారు. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో 2,050 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నట్టు ఆయన తెలిపారు. అందులో 1,050 డీజిల్ బస్సులు కాగా, 1,000 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయన్నారు. విడతల వారీగా ఆ బస్సులను వాడుకంలోకి తీసుకొస్తామని ఎండి సజ్జనార్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News