వాషింగ్టన్: ఫిలడెల్ఫియా వీధిలో పలువురు షూటర్లు శనివారం జనంపై కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 11 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో
ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ డి.ఎఫ్. పేస్ స్థానిక మీడియాకు తెలిపారు. ఈ సంఘటనపై స్పందించిన అధికారులు “చాలా మంది యాక్టివ్ షూటర్లు గుంపుపైకి కాల్పులు జరిపారు” అని తెలిపారు. “ఈ కాల్పులు జరిగినప్పుడు ప్రతి వారాంతంలో మాదిరిగానే వందలాది మంది వ్యక్తులు సౌత్ స్ట్రీట్‌లో సంతోషంగా గడుపుతుండడాన్ని మీరు ఊహించవచ్చు” అని పేస్ చెప్పాడు. షూటర్లలో ఒకరిపై అధికారులు కాల్పులు జరిపారని ఆయన అన్నారు. ఇదిలావుండగా ఎవరినీ అరెస్టు చేయలేదని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఘటనా స్థలం నుండి రెండు చేతి తుపాకులు స్వాధీనం చేసుకున్నామని, శనివారం రాత్రి మూసివేయబడిన సమీప దుకాణాల నుండి నిఘా ఫుటేజీని పొంది, సమీక్షించడానికి పోలీసులు ఉదయం వరకు వేచి ఉండాల్సి ఉంటుందని కూడా పేస్ తెలిపారు.దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, “సమాధానం లేని ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి” అని ఆయన చెప్పాడు.