జమ్ము: స్వాతంత్య్ర దినోత్సవాల సమయంలో ఆర్మీ క్యాంప్‌పై దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు అంతమొందించారు. అయితే, ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్ము అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం రాజౌరి జిల్లా పార్గల్‌లోని ఆర్మీ క్యాంప్ పెన్సింగ్‌ను దాటి లోపలికి వచ్చేందుకు ఉగ్రవాదులు గురువారం తెల్లవారు జామున ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై కాల్పులు జరపగా, ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. అయితే ఎదురు కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గత ఆరు నెలలుగా రాజౌరీ ప్రాంతంలో వరుసగా ఉగ్రదాడులు సాగుతున్నాయి. ఇప్పుడీ సంఘటన వెనుక లష్కరే తొయిబా ముఠా ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పంద్రాగస్టు వేళ ఉగ్రవాదులు దేశ వ్యాప్తంగా భారీ దాడులకు పన్నాగం పన్నే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై జమ్ముకశ్మీర్‌లో భారీగా తనిఖీలు చేపట్టారు. బుధవారం పుల్వామా జిల్లాలో ఓ రోడ్డు పక్కన 25కిలోల పేలుడు పదార్ధాలను గుర్తించి భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. బడ్‌గామ్ జిల్లాలో కూడా బుధవారం భద్రతాదళాలు, ముష్కరుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
3 Jawans Killed after terrorists attack in Rajaouri